డ్యూటీకి డుమ్మా.. పీహెచ్‌సీకి తాళం
వెల్ది పీహెచ్‌సీలో విధులకు హాజరుకాని సిబ్బంది
మధ్నాహ్నం వరకు ఎదురుచూసిన రోగులు
పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు
మానకొండూర్ రూరల్: అత్యవసర సేవల విభాగాల్లో ఒకటైన వైద్య, ఆరోగ్యశాఖను నిర్లక్ష్యం వెంటాడుతోంది. కలెక్టర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ.. సమీక్షిస్తున్నా వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. పండుగ రోజైనా రోగులకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది గైర్హాజరు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, పీహెచ్‌సీకి తాళం వేసిన ఘటన మానకొండూర్ మండలం లక్ష్మీపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెల్ది పీహెచ్‌సీ లక్ష్మీపూర్‌లో కొనసాగుతోంది. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో వైద్యాధికారి సాయిప్రసాద్ ఓ మేల్ స్టాఫ్‌నర్సుకు విధులు కేటాయించారు. అతను ఉదయం 9గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12దాటినా రాలేదు. దీంతో చికిత్స కోసం వచ్చిన 20మంది వరకు రోగులు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్, గ్రామస్తులు పీహెచ్‌సీ ఎదుట నిరసన వ్యక్తం చేసి, గేటుకు తాళంవేశారు. మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మెడికల్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి, గైర్హాజరైన వ్యక్తిపై చర్యలకు సిఫారసు చేస్తామని మెడికల్ ఆఫీసర్ వివరించారు.
డ్యూటీకి డుమ్మా.. పీహెచ్‌సీకి తాళం


