‘గురుకులం సొసైటీ’కి పుల్‌స్టాప్
● విద్యార్థులందరూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి ● కేవలం విద్యార్థుల ఖర్చులు భరిస్తున్న గురుకుల సొసైటీలు
జగిత్యాలఅగ్రికల్చర్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ ద్వారా ఎస్సీ, బీసీ విద్యార్థినిలకు గురుకులం సొసైటీ కింద వ్యవసాయ విద్య అందించేందుకు మహిళా వ్యవసాయ కళాశాలకు శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కోరుట్లలో ఒకటి, బీసీ వెల్ఫే సొసైటీ ద్వారా కరీంనగర్‌లో మరొకటి ఏర్పాటు చేశారు. వ్యవసాయ కోర్సులో చేరిన విద్యార్థినులకు వసతులు కల్పించలేక సొసైటీలు చేతులెత్తేశాయి. దీంతో విద్యార్థినులు, ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ప్రభుత్వ ఒత్తిడి మేరకు నిబంధనలు సవరించి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సొసైటీ కింద ఉన్న విద్యార్థినులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకి మార్చారు.
కోరుట్ల విద్యార్థులు పొలాస కళాశాలకు
సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కింద 2023–24లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను కోరుట్లలో ఏర్పాటు చేయగా.. 83 మంది చేరారు. అడ్మిషన్లు తీసుకున్నప్పటికీ టీచింగ్ స్టాఫ్ లేదు. ల్యాబ్‌లు లేవు. ప్రాక్టీకల్స్ లేవు. ఎలా ముందుకెళ్లాలో తెలియదు. పాఠాలు బోధించేందుకు, విద్యార్థినులు ఉండేందుకు సరైన వసతులు లేక అద్దెభవనాల్లో నెట్టుకుంటూ వచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ స్టాఫ్‌ను నియమించారు. ఇంత చేసినా జాతీయస్థాయిలో ఉండే ఐకార్ సంస్థ గుర్తించలేదు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో వారిని పొలాస కళాశాలకు తరలించారు.
కరీంనగర్ మొదటి ఏడాది
విద్యార్థినుల తరలింపు
బీసీ గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో 2021లో మహిళా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయగా ప్రస్తుతం 360 మంది చదువుతున్నారు. ఇక్కడ కూడా చదువు, వసతుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఇటీవల బీసీ సంక్షేమ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేర్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే మొదటి ఏడాది విద్యార్థులను రాష్ట్రంలోని ఏడు కళాశాలల్లో 10 నుంచి 15 మందిని కేటాయించారు. రెండు, మూడో ఏడాది విద్యార్థులను త్వరలో సిరిసిల్ల, వరంగల్ వంటి ఇతర కళాశాలలకు తరలించనున్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిబంధనలు కఠినంగా ఉండటంతో సవరించే బాధ్యతలను ప్రభుత్వం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ జానయ్యకు అప్పగించింది. ఆయన గురుకులం సొసైటీ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ వ్యవసాయ వర్సిటీ బోర్డు మెంబర్లు, ఫ్యాకల్టీ, అకడమిక్ కౌన్సిల్‌తో చర్చించి సామాజిక కోణంలో ఆలోచించి, విద్యార్థినుల భవిష్యత్ దెబ్బతినకుండా వ్యవసాయ కళాశాలల్లో కలపాలని నిర్ణయించారు.


