చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన బుర్ర శ్రీనివాస్ (53) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన మేనకోడలు మానసను బైక్‌పై ఎక్కించుకుని చొప్పదండి వైపు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో జాబితాపూర్ శివారు బీబీరాజ్‌పల్లి సమీపంలోకి చేరగానే.. తన ముందు వెళ్తున్న వాహనదారుడు దొనకొండ రాజయ్య సడెన్ బ్రేక్ వేయడంతో శ్రీనివాస్ ఢీకొని కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదు. శ్రీనివాస్ కూతురు బుర్ర శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గుండెపోటుతో రైతు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మొడుసు మద్దుల భగవంతరెడ్డి(58) గురువారం పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలో ఉన్న కుమారుడు హరీష్‌రెడ్డి రాక కోసం మృతదేహన్ని ఫ్రీజర్‌లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రెండు నెలల వ్యవధిలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఐదుగురు అన్నదాతలు గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు. వ్యవసాయ పనులు చేసే భగవంతరెడ్డి ఒక రోజు ముందు నుంచి చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆస్పత్రికి వెళ్దామని చెప్పి పొలానికి మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అక్కడే తీవ్ర నొప్పి రావడంతో వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భగవంతరెడ్డికి భార్య మణెమ్మ, కుమారుడు హరీశ్‌రెడ్డి, కూతురు అనిత ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు.
బ్యాటరీ దొంగల అరెస్ట్
చొప్పదండి: మండలంలోని గ్రామాల్లో వాహనాల నుంచి బ్యాటరీల చోరీ చేస్తున్న ముఠాను చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ మహేశ్ జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. అక్కడ తిమ్మాపూర్ మండలం నల్లగొండకు చెందిన నిషాని నరేశ్ పరిచయం అయ్యాడు. నరేశ్ డబ్బు అవసరం ఉందని మహేశ్‌ను కోరగా, స్కూటీతో రావాలని సూచించాడు. స్కూటీపై ఇద్దరూ చొప్పదండి మండలంలో వాహనాల బ్యాటరీలు దొంగతనం చేస్తూ వచ్చారు. గుమ్లాపూర్, కాట్నపల్లి, ఆర్నకొండ గ్రామాల్లో అయిదు బ్యాటరీలు దొంగలించి చొప్పదండిలోని అనుమాండ్ల మల్లేశంకు విక్రయించారు. భూపాలపట్నం రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లో అయిదు బ్యాటరీల దొంగిలించడానికి ప్రయత్నించారు. లారీ డ్రైవర్ చాకచక్యంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేశ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
మల్లాపూర్: నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు దగ్ధమైన సంఘటన మల్లాపూర్ మండలకేంద్రం శివారులో గురువారం వేకువజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన సంజీవ్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో ఆడెల్లి పోచమ్మ ఆలయానికి బయల్దేరారు. మండలంలోని పాతదాంరాజుపల్లిమార్గంలో 61వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తుండగా.. కారు ఇంజిన్‌లోంచి పొగలు రావడంతో సంజీవ్ అప్రమత్తమై కుటుంబసభ్యులందరిని కారులోంచి కిందకి దింపా డు. ఇంజిన్‌లో మంటలు చేలరేగి కారు పూర్తి గా దగ్ధమైంది. డ్రైవర్ సహా మిగిలిన వారందరూ క్షేమంగా ఉన్నారు. మల్లాపూర్ పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


