రెండు ఆలయాల్లో చోరీ
ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని పురాతన ఆలయాలైన అక్కపల్లి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మినృసింహాస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. తాళాలు పగులగొట్టి.. విగ్రహాలపై ఉన్న వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో పట్టెనామాలు, కోరమీసాలు, రాజరాజేశ్వర స్వామి ఆలయం శివలింగానికి ఉన్న రెండు కిలోల వెండిపానవట్టం, అమ్మవారికి అలంకరించిన 80 గ్రాముల వెండి ముక్కుపుడక తొడుగు ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం ఐదు గంటలకు పూజారి ప్రవీణ్‌కుమార్ ఆలయానికి చేరుకోగా.. తాళం పగులగొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ చేరుకుని ఆలయాల్లో పరిశీలించారు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


