ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు మృతి
మంథనిరూరల్: రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి శివారులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన పిడుగు రాజ్‌కుమార్(33), 8వ కాలనీకి చెందిన రాంశెట్టి కిష్టయ్య(39) అక్కడికక్కడే మృతిచెందారు. మంథని ఎస్సై–2 సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ అతడి స్నేహితుడు కిష్టయ్య ద్విచక్రవాహనంపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భట్టుపల్లి శివారులోని మైసమ్మ గుడి వద్ద ఎలాంటి సూచికలు లేకుండా రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మంథని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


