గిరిజన కళాశాల కార్యాలయానికి తాళం
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాల కార్యాలయానికి యజమాని సోమవారం తాళం వేశారు. ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని, పెంచిన ఐదు శాతం అద్దెలోనూ 20 శాతం కోత విధిస్తున్నారని భవన యజమాని మురళీధర్‌రెడ్డి ఆవేదన చెందారు. అద్దె చెల్లించాలని, తనకు రావల్సిన ప్రయోజనాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూ.లక్షలు బ్యాంకు రుణంతోపాటు ఇతరచోట ఆస్తులు విక్రయించి విద్యార్థుల సౌకర్యార్థం భవనం నిర్మించి అద్దెకు ఇస్తే ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తనకు ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందిగా ఉందన్నారు. భవనం ఖాళీ చేయాలని విన్నవించినా ఏవేవో షరతులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్యం చేస్తోందని, అద్దె వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేశ్, నాయకులు మంథని లింగయ్య, బాబు రవి డిమాండ్ చేశారు. వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని వారు కోరారు.


