సదరం లేక.. అడ్మిషన్ దొరక్క
కరీంనగర్ టౌన్: మాటలు రాకపోవడం ఆ పిల్లల జీవితానికి శాపంగా మారింది. పుట్టుమూగవారు కావడంతో సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా డాక్టర్లు కనికరించడం లేదు. సర్టిఫికెట్ ఇవ్వపోవడంతో ఆ పిల్లలిద్దరూ ప్రభుత్వ ఫలాలు పొందలేక పోతున్నారు. కనీసం చదువుకు కూడా నోచుకోవడం లేదు. బధిరుల పాఠశాలలో అడ్మిషన్ దొరకడం లేదు. పిల్లల తల్లి వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లికి చెందిన బొడ్డుపల్లి స్రవంతి, రాజేష్ దంపతుల ఇద్దరు పిల్లలు పుట్టుమూగవారు. దంపతుల మధ్య గొడవతో రాజేశ్ భార్య, పిల్లలను వదిలేశాడు. కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. సదరం సర్టిఫికెట్ కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఎలాంటి పరీక్షలు చేయకుండానే హైదరాబాద్‌కి వెళ్లాలని చెబుతున్నారు. ఇలా పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. బధిరుల పాఠశాలలో సదరం సర్టిఫికెట్ ఉంటేనే అడ్మిషన్ ఇస్తామని చెబుతున్నారు. దీంతో చదువుకు దూరంగా ఉన్నారు. ఆసరా పింఛన్ కూడా రావడం లేదు. కనీస ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదని, కలెక్టర్ దయతలచి పిల్లలకు సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని తల్లి స్రవంతి వేడుకుంటోంది.
చదువుకు దూరంగా ఇద్దరు బధిర విద్యార్థులు
ఏళ్లకాలంగా తిప్పుకుంటున్న కరీంనగర్ ఆస్పత్రి వైద్యులు
సర్టిఫికెట్ ఇప్పించాలని వేడుకుంటున్న తల్లి


