ఆటల్లో మెరికలు.. సీఎం అభినందనలు
ముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయస్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తున్న దుమాల ఏకలవ్య గురుకుల బాలికలను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఒడిశాలో జరిగిన జాతీయ పోటీల్లో దుమాల గురుకుల విద్యార్థులు 35 మంది పాల్గొన్నారు. బాక్సింగ్, కుస్తీ, రెజ్లింగ్, జూడో వివిధ అంశాల్లో 17 పతకాలు సాధించారు. ఈసందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సీఎంను పీడీలు ఆకాంక్ష, కవిత్‌సింగ్, పతకాలు సాధించిన విద్యార్థులు కలిశారు. ఒలింపిక్స్ లక్ష్యంగా మరింత సాధన చేయాలని విద్యార్థులను సీఎం అభినందించారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేటలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉమ్మరవేణి రాజు (42) ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం హై దరాబాద్ వెళ్లాడు. ఎన్నికలు ముగిసినా ఇంటికి రాలేదు. రెండురోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఉన్నాడు. రాజు తీసుకున్న గదికి సంబంధించి అడ్వాన్స్ అయిపోవడంతో ఆదివారం లాడ్జి సిబ్బంది వెళ్లి పిలవగా డోర్ తీయలేదు. గది తలుపులు బలవంతంగా తెరి చి చూడగా బాత్రూంలో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా రాజు గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
ఇటుకబట్టీ కార్మికుడి హత్య
కరీంనగర్‌రూరల్: ఇటుకబట్టీ కార్మికుడు అనుమానాస్పదస్ధితిలో మృతిచెందగా తండ్రి ఫిర్యాదుతో కరీంనగర్‌రూరల్ పోలీసులు దర్యాప్తు చేయగా హత్యగా నిర్ధారించారు. కరీంనగర్‌రూరల్‌సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు.. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లోని ఇటుకబట్టీల్లో ఒడిశాకు చెందిన సూరజ్‌కుంభార్ పనిచేస్తున్నాడు. వారంరోజులక్రితం స్నేహితుడైన దుర్గ గార్డియా అదే బట్టీలో పనిచేస్తున్న ఓ మహిళతో చనువుగా ఉండగా సూరజ్‌కుంభార్‌తో వివాదమేర్పడింది. సూరజ్‌ను దుర్గ గట్టిగా కొట్టడంతో కిందపడిపోయాడు. వేకువజామున మిగితా కూలీలు చూడగా సూరజ్ చనిపోయి ఉండగా బట్టీ యజమానికి సమాచారం అందించారు. సూరజ్ రాత్రి ఎక్కువ మద్యం తాగి చనిపోయాడని, ఇక్కడే ఉంటే ప్రమాదమని దుర్గా గార్డియ బట్టీ యజమానికి చెప్పి శవాన్ని అంబులెన్స్‌లో ఒడిశాకు తరలించారు. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి సూరజ్ శవాన్ని పోస్ట్‌మార్టం చేయించగా బలమైన గాయాలతో మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయగా విచారణ చేశారు. సోమవారం గుంటూరుపల్లి వద్ద పోలీసులు దుర్గ గార్డియాను పట్టుకుని విచారణ చేయగా తాను కొట్టిన దెబ్బలతోనే సూరజ్ మృతిచెందినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఆటల్లో మెరికలు.. సీఎం అభినందనలు


