
కమీషన్ రావట్లే!
జిల్లాలోని రేషన్ డీలర్లకు
ఐదు నెలలుగా అందని కమీషన్
భారంగా దుకాణాల నిర్వహణ
సహాయకులకు
వేతనం ఇవ్వలేని దుస్థితి
సెప్టెంబర్ 5న రేషన్ బంద్‌కు నిర్ణయం
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని రేషన్ డీలర్లు కమీషన్ కోసం ఎదరుచూస్తున్నారు. ఐదునెలలుగా కమీషన్ జాడ లేకపోవడంతో సెప్టెంబర్ 5న రేషన్ దుకాణా ల బంద్ పాటిస్తున్నట్లు డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీని వాస్ ప్రకటించారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సైతం అందజేశారు. జిల్లాకు కమీషన్ బకాయి మొత్తంగా రూ.3.9కోట్లు ఉండగా, రేషన్ దుకాణాన్ని నిర్వహించడం తలకుమించిన భారమవుతోందని డీలర్లు వాపోతున్నారు. కరోనాకాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి బియ్యం పంపిణీ చేయగా, ఇటీవల ఒకేనెలలో మూడు నెలల బియ్యం అందించినా తమ శ్రమకు గుర్తింపు ఏదని ప్రఽశ్నిస్తున్నారు.
బకాయి రూ.3.9కోట్లు.. నిర్వహణ భారమే
జిల్లాలో 566రేషన్ దుకాణాలున్నాయి. వాటి ద్వారా 2.90లక్షల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో క్వింటాకు రూ.70 చొప్పున డీలర్‌కు ప్రభుత్వం కమీషన్ ఇస్తోంది. మార్చి వరకు కమీషన్ ఎప్పటికప్పుడు జమ కాగా ఏప్రిల్ నుంచి రాకపోగా ఇబ్బందులు పడుతున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వగా జూన్‌లో మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. రేషన్ కమీషన్ అందకపోవడంతో దుకాణ నిర్వహణ ఖర్చు భరించలేక అవస్థలు పడుతున్నారు. సరుకులు అన్‌లోడ్ చేసేందుకు హమాలీకి క్వింటాల్‌కు రూ.8, లారీ డ్రైవర్‌కు రూ.200, విద్యుత్ బిల్లు సుమారు రూ.500, గది లేదా షట్టర్ కిరాయి రూ.2వేలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ– పోస్ మిషన్ రీచార్జికి రూ.200, సహాయకులకు రూ.2వేలకు పైగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. నెలకు రూ.5వేల నుంచి 6వేల వరకు ఖర్చు అవుతోందని, వంద క్వింటాళ్లు పంపిణీ చేస్తే వచ్చే కమీషన్ రూ.7వేలు కాగా.. ఖర్చులు పోనూ మిగిలేది రూ.వెయ్యి నుంచి రెండు వేలే అని వాపోతున్నారు. కొందరు ఇళ్లు గడవకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక చిరు వ్యాపారాలు వెతుక్కుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే వ్యవసాయం లేదా కూలీకి వెళ్తున్నారు.
డీలర్ల డిమాండ్లు ఇవే
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కనీస గౌరవ వేతనం రూ.5వేలు, కమీషన్ రూ.300కు పెంచాలి. రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలి. బియ్యం పంచే క్రమంలో దుమ్ము,ధూళితో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలి. బియ్యం దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించడంతో పాటు గత 10ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలి. గోదాం ప్రాంగణంలో శాశ్వత ప్రాతిపాదికన వే బ్రిడ్జిల ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 800 కార్డులు, పట్టణ ప్రాంతాల్లో 1,200 కార్డులకు పైబడి ఉంటేనే బైఫర్కేషన్ చేయాలి. రెండేళ్లకోసారి చేపట్టకుండా ఆథరైజేషన్ రిన్యువల్స్‌ను శాశ్వతంగా కొనసాగించాలి. రేషన్ దుకాణాల అద్దెను ప్రభుత్వమే భరించడంతో పాటు తరుగు కింద 2శాతం బియ్యం కోటాను అదనంగా ఇవ్వాలి. డీలర్లలో ఉన్నత విద్యావంతులకు శాఖాపరమైన పదోన్నతులు కల్పించాలి.
జిల్లాలో మొత్తం
గ్రామ పంచాయతీలు: 313
నగరపాలక సంస్థ: 1
మున్సిపాలిటీలు: 3
మొత్తం రేషన్ డీలర్లు: 566
కార్డుదారులు: 2.90 లక్షలు
రావాల్సిన బకాయి: రూ.3.9కోట్లు

కమీషన్ రావట్లే!