
● మూడు నెలలకే కంకర తేలిన సీసీ రోడ్డు ● ఇబ్బంది పడుతున్న
నాణ్యత పట్టదా?
కరీంనగర్ కార్పొరేషన్: వానాకాలం బురద, గుంతలతో... ఎండాకాలం దుమ్ము, ధూళితో పడుతున్న కష్టాలు ఇక ముగిసినట్లేనని ఆ కాలనీవాసులు ఊపిరిపీల్చుకున్నారు. కొత్తగా సీసీ రోడ్డు నిర్మించడంతో మురిసిపోయారు. ఆ మురిపెం మూణ్నాళ్లు కూడా ఉండలేదు. సీసీ రోడ్డుపై కంకర తేలుతుండడంతో, కొద్ది రోజులకే మళ్లీ పాత కష్టాలు తప్పవంటూ ఆ కాలనీ వాసులు ఊసురుమంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి రహదారి నుంచి రజ్విచమాన్, సిటిజెన్స్‌కాలనీలకు వెళ్లే మెయిన్‌రోడ్డు ఏళ్లకాలంగా అధ్వానంగా ఉంది. గతంలో బొమ్మకల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్డు కష్టాల గురించి కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరి గినా ఫలితం కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోడ్డు పనులు ప్రారంభించడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పటికి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ రోడ్డుకు నగరపాలకసంస్థ నిధులు వెచ్చించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం, ఫిర్యాదులు, ప్రభుత్వం మారడం తదితర కారణాలతో ఆ రోడ్డు నిర్మాణ పనులు సగంలోనే ముగిసిపోయాయి. అప్పటి నుంచి ఆకాలనీ వాసుల కష్టాలు మరింతగా పెరిగాయి.
మూడు నెలలకే..
గత జనవరిలో బొమ్మకల్ నగరపాలకసంస్థలో విలీ నం కావడం తెలిసిందే. అనంతరం రజ్విచమాన్ రోడ్డు నిర్మాణానికి కదలిక వచ్చింది. సుమారు రూ.20 లక్షలతో ఈ సీసీ రోడ్డు పనులు చేపట్టారు. గత ఏప్రిల్‌లో నిర్మాణం పూర్తయింది. రెండు, మూడు నెలల్లోనే రోడ్డుపై సిమెంట్ పోయి కంకర తేలడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. నడిరోడ్డుపై కంకర తేలడంతో మళ్లీ గుంతలు పడే అవకాశం కనిపిస్తోంది. సీసీ రోడ్డుకు ఒక వైపు కుంగినట్లుగా మారడంతో, తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికై నా సీసీ రోడ్డు నాణ్యతపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, లోపాలను సరిచేసి,నాలుగు కాలాలపాటు రోడ్డు ఉండేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.