
సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెట్టాలి
కరీంనగర్‌క్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. రౌడీ, హిస్టరీ షీటర్లు, సంఘవిద్రోహ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి, వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలన్నారు. సోమవారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డయల్ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని పాయింట్‌బుక్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, గణేశ్ మండపాల నిర్వాహకులకు నిబంధనలు తెలియజేయాలన్నారు. మండపాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించుకునేలా చూడాలని సూచించారు. పోలీస్ కమిషనరేట్ తరఫున 50 సీసీ కెమెరాలు కొన్నామని, మరో 50 కెమెరాలు కొని, ముఖ్య కూడళ్లు, సున్నితమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కెమెరాలను జియో ట్యాగింగ్ చేయడం, అవసరమైనప్పుడు ఫుటేజ్ సేకరించడం వంటి విషయాలపై బ్లూకోల్ట్స్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ సీసీఆర్బీ శ్రీనివాస్ జి, ఇన్‌స్పెక్టర్లు సరిలాల్, వెంకటేశ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
గణేశ్ నవరాత్రుల పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో గణేశ్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి నిర్వాహకులకు పలు ముఖ్య సూచనలు చేశారు. మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా ఎలక్ట్రిక్ తీగలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి, మహిళల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్కటైనా సీసీ టీవీ కెమెరా ఏర్పాటు చేయాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయొద్దని అన్నారు. భక్తి పాటలను మాత్రమే వేయాలని, డీజేల వాడకం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ఇప్పటికే పంపించిన లింకులో మండప వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, ప్రాంత వివరాలను నమోదు చేయాలన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, శ్రీనివాస్, హిందూ సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.