
అమ్మా.. సమస్యలతో వేగలేం
కరీంనగర్ అర్బన్: అమ్మా.. సమస్యలతో వేగలేకపోతున్నాం. మేము ఫిర్యాదులిస్తున్నాం.. మీరు పరిష్కరించాలని చెబుతున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. సమస్యలతో వేగలేకపోతున్నాం.. జర మా సమస్యల్ని పరిష్కరించమ్మ అంటూ బాఽధితులు గగ్గోలు పెట్టారు. మొక్కుబడిగా ప్రజావాణికి రావడం, వెళ్లడమే తప్ప అర్జీలకు పరిష్కారం అంతంతమాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలను వివరించగా ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు తదితర సమస్యలు రాగా మొత్తంగా 328 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవచూపారు.
మొత్తం అర్జీలు: 328
ఎక్కువగా
మున్సిపల్ కార్పొరేషన్: 55
డీపీవో: 20, వారధి సొసైటీ: 18
మానకొండూర్, చిగురుమామిడి,
కరీంనగర్ రూరల్ తహసీల్దార్లు: 13
ఆర్డీవో, కరీంనగర్: 10
సీపీ ఆఫీస్: 10
కొత్తపల్లి, రామడుగు తహసీల్దార్లు: 10