
నానో యూరియాపై అవగాహన కల్పించండి
కరీంనగర్ అర్బన్: నానో యూరియాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం కరీంనగర్ కార్యాలయంలో డివిజన్‌స్థాయి ఎరువుల డీలర్ల సమావేశం నిర్వహించారు. వరి పంట వివిధ దశల్లో ఉండగా.. రైతులు మొదటి దఫా యూరియా వేశారని అన్నారు. ప్రస్తుత పంట దశను దృష్టిలో పెట్టుకొని నానో యూరియా వాడకం అత్యవసరమని, ప్రతీ రైతు విధిగా నానో యూరియా ఆఫ్ లీటర్‌ను ఒక యూరియా బస్తాకు బదులుగా పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. ఒక ఆఫ్ లీటర్ నానో యూరియా బాటిల్ ఒక యూరియా బస్తాకు సమానమని, ధర కూడా తక్కువని తెలిపారు. రవాణా సులభమని, పంట ఆకులు అత్యధికంగా గ్రహించి అధిక దిగుబడి సాధించొచ్చని అన్నారు. ఇఫ్కో, కోరమండల్ కంపెనీ ప్రతినిధులు నానో యూరియా ప్రయోజనాలను తెలిపారు. నానో యూరియాను పురుగు మందులో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చని వివరించారు. కరీంనగర్ డివిజన్ సహాయ సంచాలకులు రణధీర్‌కుమార్, వ్యవసాయ అధికారులు హరిత, కృష్ణ, సత్యం, ఏఈవోలు, డీసీఎంఎస్ ప్రతినిధులు, ఎరువుల దుకాణ డీలర్లు పాల్గొన్నారు.