
‘బంగారు’ చికిత
● ఆర్చరీ వరల్డ్ యూత్ గేమ్స్‌లో పసిడి పతకం సొంతం
కరీంనగర్ స్పోర్ట్స్/ఎలిగేడు: షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 పోటీల్లో రజతం, బ్యాంకాక్ ఏషియాడ్‌లో కాంస్యం, ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో కాంస్యం.. ఇలా తను పాల్గొన్న ప్రతీ ఈవెంట్‌లో ఏదో ఒక పతకంతో సత్తా చాటుతోంది చికిత. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కెనడా దేశంలోని వెన్నిపెగ్‌లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఆదివారం వేకువజామున కొరియా క్రీడాకారిణి పార్క్ యరీన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 142–136 పాయింట్ల తేడాతో ఓడించింది. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో శిక్షణ పొందుతున్న చికిత ఇదివరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. ప్రస్తుతం పసిడి పతకం సాధించడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, శ్రీలత ఆనందం వ్యక్తం చేశారు.
27న చవితి.. 5న నిమజ్జనం
కరీంనగర్ కల్చరల్: వినాయక చవితి పండుగను ఆగస్టు 27న జరుపుకోవాలని నగర వైదిక పురోహితుడు మంగళపల్లి శ్రీనివాస్‌శర్మ ఒక ప్రకటనలో సూచించారు. నివాసాలు, మండపాల్లో ప్రతిిష్ఠించిన గణపతులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తొలిపూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 5న నిమజ్జనోత్సవం జరుపుకోవాలని పేర్కొన్నారు. 7న భాద్రపద పూర్ణిమా రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని వివరించారు.