
బియ్యం ముక్కిపోతున్నాయ్
ఐదు నెలలుగా రేషన్ దుకాణాల్లో నిల్వ మిగిలిన దొడ్డు, సన్న బియ్యంతో డీలర్ల ఆందోళన కొత్త స్టాక్ కేటాయించాలని విజ్ఞప్తి
కరీంనగర్‌రూరల్: రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. మార్చి వరకు లబ్ధిదారులకు ప్రభుత్వం దొడ్డుబియ్యాన్ని పంపిణీ చేసింది. ఏప్రి ల్ నుంచి సన్నంబియ్యం అందిస్తున్నారు. అంతకుముందుగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా నిల్వ ఉంటున్నాయి. పలుచోట్ల లక్క పురుగు పడుతుండగా మరికొన్ని చోట్ల ముక్కిపోతున్నాయి. దొడ్డు బియ్యాన్ని తరలించకుండా ఇలాగే ఉంచితే పనికిరాకుండా పోతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని మొత్తం 29 రేషన్ దుకాణాల్లో 314 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం, 100 క్వింటాళ్ల సన్నబియ్యం నిల్వ ఉన్నాయి.
వర్షాలతో డీలర్ల ఆందోళన
కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ దుకాణాలు అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. గదులు చిన్నవిగా ఉండటంతో పాటు దొడ్డు బియ్యం నిల్వ ఉండటంతో మరింత ఇరుకుగా మా రింది. మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి ఇవ్వడంతో రెండు నెలలుగా డీలర్లు దుకాణాలను తెరవలేదు. వర్షాలకు నిల్వ ఉన్న బియ్యం పరిస్థితి ఎలా ఉందోనని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డు, సన్న బియ్యం నిల్వతో ఇబ్బందులు
రేషన్ దుకాణాల్లో దొడ్డు, సన్న బియ్యం నిల్వలు ఒకేచోట ఉంటున్నాయి. దొడ్డుబియ్యంలో పురుగులు పట్టి సన్నబియ్యంలోకి వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఈ నెల 25నుంచి రేషన్ దుకాణా లకు బియ్యం స్టాక్‌ను మండలస్థాయి స్టాక్‌పాయింట్‌నుంచి సరఫరా చేస్తారు. ఇప్పటికే దుకాణాలో దొడ్డు, సన్నబియ్యం నిల్వలతో ఇబ్బంది పడుతున్నామని కొత్తస్టాక్ బియ్యం ఎక్కడ దించుకోవాలని డీలర్లు ప్రశ్ని స్తున్నారు. సన్నబియ్యం దించుకునేందుకు సరిపడే స్థలం లేకపోవడంతో వీలైనంత త్వరగా దొడ్డు బియ్యాన్ని విక్రయించినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. అయితే దొడ్డు, సన్నబియ్యం నిల్వల తరలింపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సివిల్ సప్లై అధికారులు వివరించారు.