
సామాజిక చైతన్యంలో కవులు కీలకం
కరీంనగర్ కల్చరల్: సామాజిక చైతన్యంలో కవుల పాత్ర కీలకమని ఎస్సారార్ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ పేర్కొన్నారు. కవయిత్రి చిందం సునీత రచించిన కాలం ఒడిలో పుస్తకాన్ని ఉదయ సాహితీ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని వాగేశ్వరి కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి ఆధారంగానే కవులు కవిత్వాన్ని రాస్తారని పేర్కొన్నా రు. చిందం సునీత కవిత్వంలో ఆమె ఉత్తమ వ్యక్తిత్వం, సామాజిక చింతన, సున్నిత మనస్తత్వం కనిపిస్తాయని కొనియాడారు. పుస్తకాన్ని ప్రముఖ కవి విమర్శకుడు దాస్యం సేనాధిపతి గీతారాణి దంపతులకు అంకితమిచ్చారు. కవులు సంజీవ్, రాజారెడ్డి, లక్ష్మయ్య, గజేంద్రరెడ్డి, విజయలక్ష్మీ, మాధవి, వైరాగ్యం ప్రభాకర్, అన్నవరం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: హాకీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని డీపీవో జగదీశ్వర్ సూచించారు. జాతీయ క్రీడాదినోత్సవం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీకే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా క్రీడలకు నిలయంగా మారుతుండడం హర్షనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, జిల్లా యోగా సంఘం కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
యోగాలో రాణించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా యోగా క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి సూచించారు. జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేడ్కర్‌స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన పోటీల్లో ఎంపికై న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థి దశ నుంచే యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 నుంచి 7వరకు నిర్మల్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల కన్వీనర్ ఎం.రమేశ్, కో కన్వీనర్ ప్రియాంక, గడ్డం మధు, అర్చన, అంజిబాబు, పరమేశ్వర్, సత్యనారాయణ, శంకర్ పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్‌లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ‘విద్యుత్ అధికారుల పొలంబాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1,181 లూజ్‌లైన్లను పునరుద్ధరించామని, 791 వంగిన పోల్స్‌ను సరి చేశామని, 2,090 మధ్య స్తంభాలు నెలకొల్పామని తెలిపారు. 144 లో లెవెల్ లైన్ క్రాసింగ్, 145 డబుల్ ఫీడర్ల పాయింట్లను మార్చామన్నారు. జన సామర్ధ్యం గల ప్రదేశాలలో భద్రత సూచనల బోర్డులు ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సరి చేస్తున్నామని అన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీనంబర్‌ను సంప్రదించాలని కోరారు.

సామాజిక చైతన్యంలో కవులు కీలకం

సామాజిక చైతన్యంలో కవులు కీలకం