
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
కరీంనగర్‌క్రైం/మానకొండూర్/శంకరపట్నం/మల్యాల ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ బస్టాండు సమీపంలోని ఓ హోటల్‌లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ రాంచందర్‌రావు, ఎస్సై రాజన్న వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని బాలబస్తీకి చెందిన మహమ్మద్ సాదిక్‌పాషాకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు మహమ్మద్ మదస్సర్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవాడు. ఉద్యోగం పోయి, చేసిన వ్యాపారంలోనూ నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్తున్నానని నరేశ్ అనే స్నేహితుడికి చెప్పి కరీంనగర్ వచ్చాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో గది తీసుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడు. నరేశ్ సాధిక్‌పాషాకు ఫోన్ చేసి మదస్సర్ చనిపోతానని చెప్పాడని తెలుపగానే హైదరాబాద్‌లో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు తుకారాం గేటు పోలీసులను ఆశ్రయించారు. టెక్నాలజీ సాయంతో కరీంనగర్‌లోని హోటల్ వివరాలు చెప్పగా, శుక్రవారం వారు వచ్చి హోటల్ గదికి కిటికీలో నుండి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి ఉన్నాడు. సాధిక్ పాషా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అత్తింటి వేధింపులతో వివాహిత
మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి శైలజ(28) అత్తింటి వేధింపులతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి నాగరాజుకు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన శైలజతో 2021లో వివాహమైంది. కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 21న పెద్దమనుషుల సమక్షంలో సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఇదే రోజు సాయంత్రం శైలజ అత్తారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తండ్రి గోనెల తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
అనారోగ్యంతో..
శంకరపట్నం మండలం కాచా పూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య(75) అనా రోగ్యంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పోచయ్య మూడేళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. 10 రోజుల క్రితం రూ.లక్ష ఖర్చు చేసి వైద్యం చేయించినా నయం కాలేదు. గురువారం భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోగా, ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.
మల్యాలలో..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బైరి బీరయ్య భార్య కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా బాధపడుతోంది. బీరయ్యసైతం అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు రాజమల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య