
విద్యుదాఘాతంతో ప్రైవేట్ కార్మికుడి మృతి
● పరిహారం చెల్లించాలని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ధర్నా
కొత్తపల్లి(కరీంనగర్): సిద్దిపేట జిల్లా అక్కన్నపల్లి మండలం గండిపల్లి గ్రామానికి చెందిన బూక్య భాస్కర్ శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతిచెందాడు. కరీంనగర్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహం సమీపంలోని ఓ మెస్ ఎదుట టవర్లకు ఎల్‌టీ లైన్‌ల పనులను కాంట్రాక్టర్ భూపేశ్ తీసుకోగా.. అతడు సబ్ కాంట్రాక్ట్ కింద తిరుపతికి అప్పజెప్పాడు. ఈ పనులను చేసేందుకు భాస్కర్‌ను కూలీగా నియమించుకున్నారు. ఎల్‌టీ లైన్‌ల పనులు చేస్తున్న క్రమంలో టవర్‌పై ఉన్న హైవోల్టేజీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈలోపే భాస్కర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. సాయంత్రం సమయంలో ధర్నా చేపట్టడంతో కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది బయటకు వెళ్లలేక అవస్థలు పడ్డారు. గిరిజన సంఘాల నాయకులు తిరుపతినాయక్, రాజునాయక్, సోమానాయక్, నరసింహనాయక్, రాజు, శ్రేయస్, లక్పతినాయక్, బాధితుని కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్లు, రూ.50లక్షలు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

విద్యుదాఘాతంతో ప్రైవేట్ కార్మికుడి మృతి