
యూరియా అక్రమాలకు చెక్
కరీంనగర్‌రూరల్: జిల్లాలో యూరియా విక్రయాలు పక్కదారి పట్టకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాల్లోని యూరియా విక్రయాల బాధ్యతను క్లస్టర్ పరిధిలోని ఏఈవోలకు అప్పగించారు. ఆయా కేంద్రాల్లో యూరియా సక్రమంగా రైతులకు పంపిణీ చేసేలా ఏవోలు, ఏడీఏలు పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం నుంచి సంబంధిత సహకార సంఘాల్లో ఏఈవోల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతోంది. కరీంనగర్ మండల వ్యవసాయాధికారి బి.సత్యం దుర్శేడ్, చెర్లభూత్కూర్, నగునూరు కేంద్రాల్లో యూరియా పంపిణీ విధానాన్ని తనిఖీ చేశారు.
కొత్తగా సేల్స్ రిజిస్టర్
సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాల్లో బుధవారం నుంచి యూరియా విక్రయాల వివరాలను నమోదు చేసేందుకు కొత్తగా సేల్స్ రిజిస్టర్లు ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఈపాస్ మిషన్ల ద్వారానే రైతులకు అవసరమైన ఎరువులను విక్రయించగా స్టాక్ రిజిస్టర్లను నిర్వహించారు. దీంతో ఏ రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు విక్రయించారనే సమాచారం అందుబాటులో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎరువుల విక్రయాల పక్కా సమాచారం కోసం సేల్స్ రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు పేరు, గ్రామం, ఎంత విస్తీర్ణం, ఎన్ని యూరియా బస్తాలు ఇచ్చారనే వివరాలు ఏఈవోలు రిజిస్టర్‌లో నమోదుచేస్తున్నారు. ఈ విధానంతో ఆయా గ్రామాల్లోని ఎంతమంది రైతులు ఎన్ని యూరియా బస్తాలు తీసుకెళ్లారనే సమాచారం తెలుస్తోంది. సేల్స్ రిజిస్టర్లలోని యూరియా విక్రయాల వివరాలను ఏఈవోలు ఎప్పటికపుడు ఉన్నతాధికారులకు అందించడంతో సరిపడే యూరియా స్టాక్ తెప్పించేందుకు వీలవుతుంది. మండలపరిధిలోని గ్రామాల రైతులకు మాత్రమే యూరియా విక్రయించాలనే కలెక్టర్ ఆదేశాలతో స్థానిక రైతులకు సరిపడే యూరియా లభించే అవకాశం ఏర్పడింది.