
నవరాత్రులకు పటిష్ట ఏర్పాట్లు
కరీంనగర్‌క్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ గౌస్‌ఆలం అధికారులను ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. గణపతి విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. సీఐలు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను తరచూ సందర్శిస్తూ, సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఏసీపీలు నెలవారీ నేరసమీక్షలు నిర్వహించాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డు నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్‌ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డీసీపీ (ఏఆర్) భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్, వేణుగోపాల్, సతీశ్, విజయకుమార్, శ్రీనివాస్‌జి, నర్సింహులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.