
ఎస్జీఎఫ్ క్రీడలకు వేళాయె..
● షెడ్యూల్ ఖరారు చేసే పనిలో కార్యదర్శులు
● చివరి వారంలో ప్రారంభం కానున్న మండలస్థాయి పోటీలు
● సన్నద్ధమవుతున్న విద్యార్థులు
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాల్లో క్రీడల సందడి నెలకొననుంది. 2025–26 విద్యాసంవత్సరం ఆరంభమైంది. ఈ విద్యాసంవత్సరంలో జరగనున్న పాఠశాలలు, కళాశాలల క్రీడా సమాఖ్యల క్రీడాపోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో రానున్న 2 నెలలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలతో ఆయా మైదానాలు కిక్కిరిసిపోనున్నాయి. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతీ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలస్థాయిలో అండర్–14, 17, కళాశాల స్థాయిలో అండర్–19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి క్రీడాసందడి మొదలు కానుంది.
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్..
పాఠశాలస్థాయిలో అండర్–14, 17 విభాగాలకు మండల, జిల్లా, జోనల్(ఉమ్మడి జిల్లా) స్థాయిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో చివరి వారం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్, ఎంపిక నిర్వహిస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి, మూడో వారంలో ఉమ్మడి జిల్లా(జోనల్) స్థాయిలో టోర్నమెంట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన జట్లు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొననున్నాయి.
డీఈవోలతో సమావేశం
2025–26 సంవత్సరానికి 69వ ఎస్జీఎఫ్ క్రీడలకు సంబంధించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో ఎస్జీఎఫ్ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశాలు ని ర్వహించారు. పోటీల నిర్వహణ, భోజన సౌకర్యం, ఎస్జీఎఫ్ కార్యదర్శుల నియామకం తదితర వాటిపై చర్చించారు. మండల , జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలను ఏవిధంగా నిర్వహించాలి.. పోటీలను ఏఏ తేదీల్లో నిర్వహించాలి.. వర్షం కురుస్తున్న సందర్భంగా పోటీల నిర్వహణ ఏవిధంగా చేయాలని తదితర వాటిపై చర్చించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్జీఎఫ్ పోటీలకు సంబంధించిన తేదీలు ఖరారు కానున్నట్లు పలువురు పీఈటీలు తెలిపారు.
సన్నద్ధమవుతున్న విద్యార్థులు
ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తా చాటేందుకు ఆయా జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీల్లో రాణించి పతకాలు సాధించి జిల్లా, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు సాధన చేస్తున్నామంటున్నారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఆటతీరును కనబరిచేలా కసరత్తు చేస్తున్నామని, రాష్ట్ర పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్ల గెలుపే ధ్యేయంగా సాధన చేస్తున్నామని, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటామని పలువురు చిన్నారులు చెబుతున్నారు.