వేధింపులతో హమాలీ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేధింపులతో హమాలీ ఆత్మహత్య

Aug 20 2025 5:55 AM | Updated on Aug 20 2025 5:57 AM

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

కరీంనగర్‌రూరల్‌: వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఓ హమాలీ కార్మికుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు బొమ్మకల్‌ పరిధిలోని కృష్ణానగర్‌కు చెందిన తంగెళ్ల శ్రీనివాస్‌(44) గ్రామంలోని చింతపండు నాగరాజు వద్ద రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలు విడతల్లో రూ.15 లక్షల వరకు చెల్లించాడు. ఇంకా రూ.27.60లక్షలు ఇస్తేనే అప్పు ముట్టుతుందంటూ శ్రీనివాస్‌కు లాయర్‌ నోటీసులు పంపించాడు. శ్రీనివాస్‌ తన వద్ద డబ్బులు లేవని చెప్పగా, భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ నాగరాజు తోపాటు మరో వ్యక్తి బట్టు రాజేందర్‌ వేధింపులకు గురిచేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌ సోమవారం రాత్రి 10గంటలకు ఇంటి వెనక ఉన్న మామిడిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు హర్షిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

గుంపులలో ఉరివేసుకొని వ్యక్తి..

ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన ఉరగొండ లక్ష్మణ్‌(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇంట్లోని ఓ గదిలో పడుకున్న లక్ష్మణ్‌ను భోజనం చేయాలని కోరుతూ తల్లి మధునమ్మ మంగళవారం ఉదయం పిలిచింది. అతడు ఎంతకూ గదిలోంచి బయటకు రాకపోయే సరికి కిటకీలోంచి చూసింది. దీంతో ఉరివేసుకొని మృతిచెంది కనిపించాడు. ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఉన్న లక్ష్మణ్‌ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. అనారోగ్యానికి గురయ్యాడు. భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. కొంతకాలంగా ఒంటరి జీవితం గడుపుతున్న లక్ష్మణ్‌.. మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బావిలో దూకి యువకుడు..

జమ్మికుంట: తరచూ తాగి వస్తున్న కొడుకును తల్లి మందలించడంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మున్సిపల్‌ పరిధిలోని కొత్తపల్లికి చెందిన హమాలీ శివకుమార్‌(25) మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగివస్తుండడంతో తల్లి మందలించింది. కోపంతో సోమవారం ఉదయం ఇంటినుంచి వెళ్లి కొత్తపల్లి సమీపంలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి తల్లి లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ పరిధిలోని ఒడ్డెపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్‌పల్లికి చెందిన జడ బక్కవ్వ(80) మృతి చెందింది. కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్లా కోటేశ్వర్‌ వివరాల ప్రకారం.. బక్కవ్వ మనుమరాలు జడ మౌనిక అనారోగ్యంతో బాధపడుతోంది. కొత్తపల్లి మండలం బావుపేటలో తాయత్తు కట్టించుకునేందుకు ఆటోలో వెళ్తుండగా ఒడ్డెపల్లి వద్ద ట్రాక్టర్‌ ఆటోను ఢీకొట్టింది. బక్కవ్వ, మౌనిక, ఆటోడ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా బక్కవ్వ మృతి చెందింది. తల్లి మృతికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని జడ రాయమల్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

వేధింపులతో హమాలీ ఆత్మహత్య1
1/2

వేధింపులతో హమాలీ ఆత్మహత్య

వేధింపులతో హమాలీ ఆత్మహత్య2
2/2

వేధింపులతో హమాలీ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement