
అమ్మా.. ఆలకించండి!
కరీంనగర్ అర్బన్: ‘ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. మా దరఖాస్తులను పరిష్కరించరూ’.. అంటూ బాధితులు ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చి దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు డా.అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలే ఎక్కువగా రాగా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలొచ్చాయి. మొత్తంగా 265 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు.