
యూరియాకు పొటాష్ లింక్
శంకరపట్నం(మానకొండూర్): యూరియాకు పొటాష్ లింక్‌తో కేశవపట్నంలోని ఫర్టిలైజర్ దుకాణం యజమాని విక్రయిస్తున్నారు. సోమవారం కేశవపట్నంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణానికి యూరియా లారీ లోడ్ వచ్చింది. యూరియా లోడ్ దుకాణంలో దిగుమతి చేస్తుండగానే రైతులు చేరుకున్నారు. యూరియాకు డిమాండ్ ఉండడంతో.. ఒక్కో రైతు యూరియాతోపాటు పొటాష్ తీసుకెళ్లారు. కాచాపూర్ గోదాంలో యూరియా పంపిణీలో ఆదివారం గొడవ జరగగా.. 40 బస్తాలు గోదాంలో ఉన్నాయి. సోమవారం గోదాం తెరవకముందే రైతులు చేరుకున్నారు. గద్దపాక సీఈవో శ్రీనివాస్ చేరుకొని గోదాంలో ఉన్న బస్తాలను రైతులకు పంపిణీ చేయించారు. తాడికల్ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆధార్ జిరాక్స్ అందించారు.
శంకరపట్నం: మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రభుత్వం ఇటీవల పదవీకాలం మరో ఆరునెలలు పొడిగించడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో స్థానిక ఎన్నికల సమయంలో పార్టీలో చేర్చుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తి వీరందరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కాగా, శంకరపట్నం మండలం తాడికల్ విండో చైర్మన్ కేతిరి మధుకర్‌రెడ్డి కొంతకాలంగా బీఆర్‌ఎస్‌తో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్యేతోపాటు, కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు చైర్మన్లు హైదరాబాద్‌కు తరలివెళ్లినట్లు సమాచారం.
క్వింటాల్ పత్తి ధర రూ.7,600
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ.7,600 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
17,384 మంది పిల్లలకు ఆల్బెండజోల్ పంపిణీ
కరీంనగర్‌టౌన్: జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 11న పంపిణీ చేసిన అల్బెండజోల్ మాత్రలను వివిధ కారణాలతో వేసుకోకుండా మిగిలిన 17,384 మంది పిల్లలకు సోమవారం అందజేసినట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సజిదా అతహరి తెలిపారు. 2,59,365 మంది పిల్లలకు గాను 2,58,593 మందికి మాత్ర లువేసి 99.7 శాతం టార్గెట్ చేరుకున్నామని పేర్కొన్నారు.