
బల్దియాపై కాంగ్రెస్ నజర్
వెలిచాల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్
త్వరలోనే అసెంబ్లీ నియోజవకర్గ ఇన్‌చార్జిగా ప్రకటన
కార్పొరేషన్ పీఠం కై వసం దిశగా పావులు
బీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ నజర్ పెట్టింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి నగర పాలికపై కాంగ్రెస్ జెండా ఎగరలేదు. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం కార్పొరేషన్ ఆవిర్భవించినప్పటి నుంచి కాంగ్రెస్‌కు ఇక్కడ తిరుగులేదు. తెలంగాణ ఉద్యమంతో బీఆర్‌ఎస్ బలోపేతమైంది. హిందుత్వ నినాదంతో బీజేపీ వేళ్లూనుకుంది. ఫలితంగా కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రాతినిథ్యం కరవైంది. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వ్యవస్థాగతంగా బలంగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ కాగా, ఎంపీ బీజేపీ నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కరీంనగర్ కా ర్పొరేషన్‌ను గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ బాధ్యతలను ఇటీవల కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ బ లోపేతానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పార్టీ బలోపేతం, చేరికలపై కసరత్తు
కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీది వింత పరిస్థితి. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. కరీంనగర్‌లో పార్టీని నడిపించేవారు లేరు. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి పురమల్ల శ్రీనివాస్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలకు వెళ్లనున్న నేపథ్యంలో కరీంనగర్ బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని కరీంనగర్ అసెంబ్లీ బాధ్యతలను వెలిచాల రాజేందర్‌కు సీఎం అప్పగించారని సమాచారం. ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇప్పటికే వెలిచాల క్షేత్రస్థాయిలో తన పనిచేసుకుంటున్నారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. కరీంనగర్‌లోని 66 డివిజన్లలో మెజారిటీ స్థానాలు గెలవడం లక్ష్యంగా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పార్టీ మారే యోచనలో ఉన్న పలువురు వెలిచాలతో తరచుగా చర్చలు జరుపుతున్నారు. ఇక సొంత పార్టీ టికెట్ల మీద పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారిలో ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపైనా సమాంతరంగా పనిచేస్తున్నారు. సీఎం స్వయంగా నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పనుండటంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలకు ఇక తెరపడనుందని వెలిచాల అనుచరులు ధీమాగా ఉన్నారు.

బల్దియాపై కాంగ్రెస్ నజర్