
నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వర్షపు నీళ్లు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలు గౌతమినగర్, అలుగునూరు చౌరస్తాలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పరిశీలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కురిసిన వర్షాలతో నగరంలోని పలు లోతట్టు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. వీటిని తనిఖీ చేసిన కలెక్టర్, వరదనీళ్లు నాలాల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడుతాయనే సూచన మేరకు అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వర్షాలతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
భూ యజమానుల అభ్యంతరం
నగరంలోని కట్టరాంపూర్ పరిధి గౌతమినగర్ ప్రాంతంలో వరదనీళ్లు నిలిచిన ప్రాంతాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీళ్లు ఖాళీ స్థలాలు, ఇళ్ల నడుమ, రోడ్లపై నిలుస్తున్నాయి. గతంలో కాలువ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, కచ్చా నాలా తీసి నీళ్లు మళ్లించాలని ఆదేశించారు. కాలువగా చెబుతున్న స్థలం తమ సొంతమని,అందులో నుంచి ఎలా కాలువ తీస్తారంటూ సదరు స్థల యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కచ్చా నాలా ప్రతిపాదన విరమించుకొని, తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. అప్పటివరకు వరదనీళ్లతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నగరపాలకసంస్థ డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీధర్ ఉన్నారు.