
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): ఉపాధి నిమిత్తం ఓ యువకుడు గల్ఫ్‌బాట పట్టాడు. సరైన ఉపాధి, వేతనం లేక అక్కడ 25 రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన సంగెం గంగరాజం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు వినోద్(30) కొంతకాలంగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఏడాదిన్నర క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లేక, వేతనం రాక మనస్తాపానికి గురై గత నెల 22న తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.