
భూ సమస్య పరిష్కారం కోసం టవరెక్కిన రైతు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నల్లలింగయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు యాళ్ల ప్రకాశ్‌రెడ్డి శనివారం ఓ కంపెనీ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బాధితుడి కథనం ప్రకారం.. ప్రకాశ్‌రెడ్డి, నర్సింహారెడ్డి అన్నదమ్ములు. వీరిద్దరికి గ్రామ శివారులోని సర్వే నంబర్లు 74, 80లో చెరో 2.22 గుంటల భూమి ఉంది. ఈ భూములోంచే ధర్మారం– పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మించారు. రోడ్డు వైపుఉన్న భూమికి డిమాండ్ పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య భూ సమస్య తలెత్తింది. ఈక్రమంలోనే సర్వేనంబరు 74లోని భూమిలో నర్సింహారెడ్డి దుక్కిదున్నుతుండగా.. ప్రకాశ్‌రెడ్డి అక్కడకు వెళ్లాడు. తనకు వాటాగా వచ్చిన భూమిలో ఎందుకు దున్నుతున్నావని ప్రశ్నించాడు. నర్సింహారెడ్డి ఆగ్రహంతో ప్రకాశ్‌రెడ్డిపై దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా చంపుతానని బెదిరించాడు. గత్యంతరం లేక ప్రకాశ్‌రెడ్డి సెల్‌టవర్ ఎక్కాడు. వారసత్వంగా వచ్చిన ఈ భూమి పంపకం విషయంలో ఇద్దరూ సమానంగా పంచుకున్నా.. నర్సింహారెడ్డి తనకు అన్యాయం చేసినట్లు ఆరోపించాడు. ఇదే సమస్యపై గ్రామంలో పలుసార్లు పంచాయితీలూ జరిగాయన్నాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. సమస్య పరిష్కారం కోసమే టవర్ ఎక్కినట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో రైతు టవర్ దిగాడు. కాగా, ఈవ్యవహారం కోర్టు వరకు వెళ్లినట్లు సమాచారం.