
రాఖీ కట్టుకుని.. గుండెపోటుతో మృతి
● నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు
గొల్లపల్లి: రాఖీ పండుగ రోజు.. ఉదయం ఆ ఇంట్లో రక్షాబంధన్ వేడకలు ఆనందంగా జరుపుకున్నారు. సాయంత్రం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రాఖీ పౌర్ణమి పర్వదినాన తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గరిగంటి అనిల్(24) హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కుటుంబ సభ్యులు.. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గరిగంటి తిరుపతి, సత్తవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. చిన్నకుమారుడు అనిల్ హైదరాబాద్‌లో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల కిత్రం స్వగ్రామమైన రాఘవటప్నం వచ్చాడు. స్నేహితులతో ఉత్సాహంగా గడిపాడు. రాఖీ పండుగ సందర్భంగా అక్క అనూష ఇంటికొచ్చింది. ఇద్దరు సోదరులకు రాఖీ కట్టింది. అనూష ఇంటికి రావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనిల్ మధ్యాహ్న భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రమైన లేవకపోవడంతో కుటుంబసభ్యులు నిద్రలేపారు. ఉలుకుపలుకు లేకపోవడంతో అతడిని వెంటనే జగి త్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిద్రలోనే గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పండుగపూట జరిగిన ఈ ఘట న గ్రామస్తులను కలచి వేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.