జ్వరం.. భయం | - | Sakshi
Sakshi News home page

జ్వరం.. భయం

Aug 8 2025 8:53 AM | Updated on Aug 8 2025 9:19 AM

● ఆందోళన కలిగిస్తున్న సీజనల్‌ వ్యాధులు ● పెద్దాసుపత్రికి క్యూ కడుతున్న రోగులు ● నిత్యం 1,100 దాటుతున్న ఓపీ ● 470కి పైగా ఇన్‌ పేషెంట్లుగా నమోదు ● జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు

కరీంనగర్‌టౌన్‌:

జిల్లాను జ్వరం భయం వణికిస్తోంది. వాతావరణంలో మార్పులతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రభు త్వ ప్రధానాసుపత్రితో పాటు అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో పాటు డయేరియా బారిన పడ్డ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నగరంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్‌)కి రోజుకు సుమారు 1,100 మంది పైగా జ్వరాలతో చికిత్సల కోసం వస్తున్నారు. ప్రస్తుతం 470 మందికి పైగా ఇన్‌పేషెంట్లతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వందల సంఖ్యలో రోగులు సీజనల్‌ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు.

అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు

● ఇటీవల కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో అ పరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలు షిత తాగునీరు, దోమలు, ఈగల ద్వారా అతిసా రం, టైపాయిడ్‌, చికున్‌గున్యా, డెంగీ, మలేరి యా వ్యాప్తి చెందుతున్నాయి. రక్తకణాలు తగ్గిపోవడంతో పలువురు మంచాన పడుతున్నారు.

● పరిసరాల శుభ్రత, ఆహార నియమాలు పాటించటంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్ల చుట్టూ నీరు నిలవడం, మురుగు గుంతలతో ఈగలు ముసిరి టైపాయిడ్‌ వ్యాప్తి చెందుతోంది. తరుచూ జ్వరం వస్తుంటే రక్త పరీక్ష చేసుకుని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలి.

● దోమకాటుతో మలేరియా, చికున్‌గున్యా వ్యాప్తి చెందుతున్నాయి. ‘ఎనాఫిలస్‌’ దోమవల్ల మలేరియా వస్తోంది. తరచూ తలనొప్పి, చలి జ్వరం వేధిస్తుంటే చికెన్‌గున్యా సోకినట్టు సంకేతం.

● పారిశుధ్య లోపంతో హెపటైటిస్‌ సోకుతుంది. కాలేయానికి ఇబ్బందులు ఏర్పడి పచ్చకామెర్లు వస్తాయి. కళ్లు, చర్మం పచ్చబడటం వ్యాధి లక్షణాలు. వైద్యం పొందుతూ, కాచి చల్లార్చి వడకట్టిన నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు.

● ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిల్వ ఆహార పదార్థాలు, తాగునీరు కలుషిత కావడం వల్ల అతిసార సంక్రమించే అవకాశముంది. చేపలు, మాంసాహారం, అపరిశుభ్ర వాతావరణంలో వీధుల్లో విక్రయించే తినుబండారాల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి వస్తోంది.

దండుకుంటున్న ప్రైవేటు నిర్వాహకులు

సీజనల్‌ వ్యాధులు జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జ్వరం వచ్చిందని వెళ్లిన వ్యక్తి నుంచి రక్తపరీక్ష, మూత్రపరీక్ష, స్కానింగ్‌ పేరిట వేలకు వేలు దండుకుంటున్నారు. రక్తకణాలు తగ్గాయని, అడ్మిట్‌ ఉండాలని భయాందోళనకు గురిచేస్తున్నారు. మందులు, పరీక్షలు, ఆస్పత్రి ఫీజు పేరిట రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తి జ్వరం వచ్చిందని వెళ్తే రోజుకు కనీసం రూ.10వేలకు పైగా ఆస్పత్రిలో ఖర్చవుతోందని పలువురు చెబుతున్నారు. అడ్డగోలు పరీక్షలు చేస్తూ.. అవసరం లేదని మందులు రాస్తూ, డయాగ్నోస్టిక్‌ సెంటర్లతో కలిసి రక్తం తాగుతున్నారని వాపోతున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

జీజీహెచ్‌లో ఓపీ వివరాలు

ఆగస్టు 1 1,105

ఆగస్టు 2 1,204

ఆగస్టు 4 1,375

ఆగస్టు 5 1,219

ఆగస్టు 6 1,111

ఆగస్టు 7 1,113

అన్ని జ్వరాలు డెంగీ కాదు

సాధారణంగా జ్వరం రెండు, మూడు రోజులు మించి ఉంటే డెంగీగా కంగారు పడుతున్నారు. అన్ని జ్వరాలు డెంగీ కాదు. సాధారణ జ్వరం వచ్చిన వ్యక్తి శరీరంలో రక్తకణాలు పడిపోతాయి. జ్వరం తగ్గిన తరువాత పౌష్టికాహారం తీసుకుంటే పెరుగుతాయి. డెంగీతో రక్త కణాలు తగ్గిపోతాయని చెప్పడం అవాస్తవం. జీజీహెచ్‌కు ఎక్కువగా జ్వరాలు, డయేరియా వంటి కేసులు వస్తున్నాయి.

– డాక్టర్‌ వీరారెడ్డి,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిల్వ ఆహార పదార్థాలను తినొద్దు. ఇంటి అవసరాలకు, స్నానానికి కలుషిత నీరు వాడొద్దు. జ్వరం వస్తే వైద్యుల సలహాతో మందులు వాడాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. – ఉపేందర్‌రెడ్డి,

క్రిటికల్‌ కేర్‌ వైద్య నిపుణుడు, మెడికవర్‌

జ్వరం.. భయం1
1/3

జ్వరం.. భయం

జ్వరం.. భయం2
2/3

జ్వరం.. భయం

జ్వరం.. భయం3
3/3

జ్వరం.. భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement