ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు
రూ.15 లక్షల వరకు మోసాలు
సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
ముస్తాబాద్(సిరిసిల్ల)/సిరిసిల్లక్రైం: ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నామని.. ఆస్పత్రుల్లో ఖర్చు అయిన డబ్బులను పంపిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో కాజేసిన అంతర్‌రాష్ట్ర సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు నమోదయ్యాయి. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఓ ఫోన్‌కాల్‌లో ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నానని, వైద్యఖర్చుల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రీఫండ్ పంపిస్తున్నామని నమ్మబలికాడు.
వాట్సాప్‌కు పంపిన లింక్‌ను ఓపెన్ చేయాలని, అందులో యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలని సూచించాడు. డబ్బులు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి అతను చెప్పినట్లు చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.40 వేలు మాయమయ్యాయి. వేములవాడ పట్టణానికి చెందిన వ్యక్తి ఖాతా నుంచి ఇలాగే చెప్పి రూ.10వేలు కాజేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై గణేశ్, సైబర్ టీమ్ సభ్యులు జునైద్, గంగారెడ్డి, ఖాసీంలు సాంకేతిక సాయంతో హైదరాబాద్‌లో నిందితుడిని పట్టుకుని సిరిసిల్లకు తరలించారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగులోని భాగ్యనగర్‌కు చెందిన ముల్లుంటి సలీంమాలిక్(32)గా గుర్తించారు. అతడిపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 79 కేసులు నమోదయ్యాయి. వివిధ వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.15లక్షల వరకు మోసం చేశాడు. నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

అంతర్‌రాష్ట్ర సైబర్ నేరస్తుడి అరెస్టు