
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో శుక్రవారం రాత్రి 8.30గంటలకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చుక్క అంజమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంజమ్మకు మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతోంది. శుక్రవారం రాత్రి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తల పగిలి చనిపోయింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
వివాహం ఇష్టం లేక ఆత్మహత్య
చొప్పదండి: పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన వనపర్తి సంధ్య(27) వివాహం ఇష్టంలేక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి కనుకయ్య, లక్ష్మిల మూడో కుమార్తె సంధ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఇంట్లో వారు పెళ్లి పనుల్లో ఉండగా.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తండ్రి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.
దొంగతనం మోపారని యువకుడు..
జూలపల్లి(పెద్దపల్లి): తనపై దొంగతనం మోపారనే అవమాన భారంతో వడ్కాపూర్ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్(25) చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్కాపూర్ గ్రామానికి రంజిత్ ఈనెల 6న సాయంత్రం మద్యం కొనుగోలు కోసం అదేగ్రామంలోని అంగరి రజిత బెల్ట్‌షాపుకు వెళ్లాడు. బీరు కొనుగోలు చేసి తాగాడు. ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కౌంటర్‌లోని డబ్బులు లేవని, ఆ డబ్బు తీశాడనే నెపంతో బెల్ట్‌షాపు నిర్వాహకులు రంజిత్ బట్టలు విప్పి తనిఖీ చేశారు. దీనిని అవమానంగా భావించిన యువకుడు.. ఇంటికి వెళ్లాడు. తాను కరీంనగర్ వెళ్లి పని చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంటికి వచ్చిన రంజిత్ చీరతో దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికిలోంచి చూడగా రంజిత్ ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు.
స్వగ్రామానికి మృతదేహం
మేడిపల్లి(వేములవాడ): భీమారం మండల కేంద్రానికి చెందిన చెక్కపల్లి గంగారాం(52) ఇటీవల దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందగా శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గంగాధర్ దాదాపు 30 ఏళ్లుగా దుబాయ్ వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా, కూతుళ్లకు పెళ్లిల్లు జరిగాయి. అందరితో కలుపుగోలుగా ఉండే గంగాధర్ విగతజీవిగా గ్రామానికి చేరడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించిన దొంగను పట్టుకుని, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల దినేశ్ కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ ఒక చోట పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల టౌన్ ఎస్సై సుప్రియ వాహనాల తనిఖీ చేస్తుండగా హోండా యాక్టివ్ వాహనంపై వస్తున్న దినేశ్ పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా 9 వాహనాలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగిపై వేధింపులు.. విచారణ
కోల్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓ మహిళా ఉద్యోగినిపై సూపర్‌వైజర్ తాజుద్దీన్ వేధింపులకు గురిచేశాడని వస్తున్న వివాదంపై విచారణ చేపడుతున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్ సింగ్ తెలిపారు. ఆస్పత్రిలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి గ్రీవెన్స్‌సెల్ కమిటీతోపాటు లింగ వేధింపుల నిరోధక కమిటీ కూడా బాధితురాలు ఫిర్యాదు చేయలేదన్నారు. అయినా ఈ వివాదంపై ప్రత్యేక కమిటీ వాస్తవాలు తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు. సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణలను ఖండించారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవో రాజు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి