
ఆర్నెళ్లకే నూరేళ్లు
● బీరువా మీద పడి పసిపాప మృతి
కోరుట్ల/మల్లాపూర్: చెక్క బీరువాతో కొడుకు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అది పక్కకు ఒరిగి కింద పడి అక్కడే పడుకుని ఉన్న ఆరు నెలల పసిపాపై పడడంతో పాప అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవపేటకు చెందిన బైరి రవికుమార్–మమత దంపతులకు కుమారుడు, కూతురు శివాని(ఆరునెలలు) ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమారుడు ఇంట్లో ఉన్న చెక్క బీరువాతో ఆడుకుంటుండగా అది పక్కకు ఒరిగింది. దాని పక్కనే శివాన్షీ పడుకుని ఉండటంతో బీరువా ఆమైపె పడింది. చెక్క బీరువా శివాన్షీ తలపై పడటంతో పసిపాప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాగా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని తెలిసింది. కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించగా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆరు నెలలకే నూరేళ్లు నిండాయని స్థానికులు కంటతడిపెట్టారు.
ఇంటి లోన్‌కోసం వెళ్లి అనంత లోకాలకు..
కొత్తపల్లి(కరీంనగర్): ఇంటి లోన్ తీసుకునేందుకు వెళ్లి కొత్తపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాలు విరిగింది. కొత్తపల్లి ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల మేరకు గంగాధరకు చెందిన ఆదిరెడ్డి(50), వేణు ఇంటిలోన్ విషయమై బైక్‌పై కరీంనగర్‌కు వచ్చారు. పని ముగించుకుని గంగాధర వెళ్తుండగా కొత్తపల్లిలోని ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వేణు కాలికి తీవ్ర గాయాలు కాగా, వెనక కూర్చున్న ఆదిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని, క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ఇతని ఇద్దరు కుమారుల్లో ఒకరు విదేశాల్లో.. మరొకరు హైదరాబాద్‌లో ఉన్నారు. మృతుడి సోదరుడు రాజుల కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

ఆర్నెళ్లకే నూరేళ్లు