బావిలో మునిగి వ్యవసాయ కూలీ మృతి
ఎలిగేడు(పెద్దపల్లి): నర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంపెల్లి పోచయ్య(74) ఆదివారం సాయంత్రం తన మనుమడు సాయిగణేశ్‌కు ఈత నేర్పేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు పోచయ్య నీట మునిగి పోయాడు. సమాచారం ఆందుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా అర్ధరాత్రి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుని కొడుకు వేణుకుమార్ రెండేళ్ల క్రితం రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోదిస్తోంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
కరీంనగర్‌క్రైం: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. వావిలాలపల్లిలో ఉంటున్న జక్కం సాయిసందీప్‌కు 12 ఏళ్ల కిత్రం గుంటూరుకు చెందిన జక్కం గీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. సాయిసందీప్ మొదట ఒక ప్రయివేట్ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టడంతో నష్టాలపాలయ్యాడు. అప్పటి నుంచి మనోవేదనకు లోనవుతూ చనిపోతానంటూ పలుమార్లు తన భార్యతో అనేవాడు. గతంలో సాయిసందీప్‌కు అతడి కుటుంబ సభ్యులు మానసిక వైద్యం కూడా చేయించారు. గతనెల 31న గీత తన పుట్టింటికి వెళ్లడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. తీవ్రంగా వాంతులు, విరేచనాలు కావడంతో తన కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. వెంటనే వారు ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా.. వారు పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ అరెస్టు
ముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై గణేశ్ సోమవారం తెలిపారు. ముస్తాబాద్‌కు చెందిన కూర సిద్దిరాములు(54) ద్విచక్ర వాహనంపై వస్తుండగా, గూడూరు నుంచి డీసీఎం వ్యాన్‌తో వేగంగా ఆజాగ్రత్తగా నడిపిన ఆసిఫ్(24) ఢీకొట్టాడన్నారు. ఈ సంఘటనలో సిద్దిరాములు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సిద్దిరాములును ఢీకొట్టి పరారీ అయిన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టామన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్‌గా గుర్తించి డీసీఎం వ్యాన్‌తో సహా అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.


