
అమర కలం.. విమల గానం
● అరుణోదయ పర్యాయపదాలు.. విమలక్క, అమర్
● ఆలేరు.. వేములవాడను కలిపిన వైనం
● అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు 50 ఏళ్లు
● నేడు హైదరాబాద్‌లో స్ఫూర్తి సభ
సిరిసిల్ల: విమలక్క, అమర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్)కు పర్యాయపదాలు. ఒకరు పాటలను కై గట్టి రాస్తుంటే.. మరొకరు గొంతెత్తి పాడుతారు. ఆలేరుకు చెందిన విమల, వేములవాడకు చెందిన అమర్‌లను ఉద్యమమే కలిపింది. అతను పాటల ప్రవాహమైతే.. ఆమె ప్రవహించే జలపాతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కూర దేవేందర్, విమల దంపతుల ఉద్యమ ప్రస్తానంలో ఎన్నో మైలురాళ్లు. అతను సాయుధుడై ప్రజాపోరాటాల్లో పాల్గొంటే.. ఆమె పాటల పల్లవై ప్రజాసంఘాల్లో పనిచేశారు. అరుణోదయ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతుల ప్రస్తానంపై కథనం.
కాలేజీలోనే కై గట్టి పాడుతూ..
సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమానికి పర్యాయపదాల్లో ఒక్కరైన కూర దేవేందర్ అలియాస్ అమర్, అలియాస్ మిత్ర మూడు దశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని సాగిస్తూనే సాహిత్య పరిమళాలు అందించారు. వెయ్యికిపైగా పాటలు రాసిన అమర్ సిద్ధాంత పుస్తకాలను ప్రచురించారు. కాలేజీ వయసు నుంచే పాటలను కై గట్టి పాటడం అలవాటైంది. అమర్ అజ్ఞాతంలో ఉండగా ఆయన షెల్టర్లపై పోలీసులు దాడులు చేసినప్పుడల్లా అతని పాటలు, సాహిత్యం ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఓ 50 ఆడియో క్యాసెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా వెయ్యి పాటలు ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. అమర్ జైలులోనే వందకు పైగా పాటలు రాశారు. పాటలు రాయడంతోపాటు బాణీలు కట్టేవారు. కొన్నింటికి అతని భార్య విమల బాణీలు కట్టి పాడారు. తాను రాసిన పాటల్లో కొన్నింటిని అమితంగా ఇష్టపడతారు. ‘గంతులేసి గోదారి గలగల పారుతుంటే.. చిందులేసి కృష్ణమ్మ పరవళ్లు తొక్కంగ అనే పల్లవితో సాగే పాటను బాగా ఇష్టపడతారు. ‘రియాజు.. రియాజు..’ ‘బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన’ పాటలను అమితంగా ఇష్టపడతారు. 978లో అమరుడైన వెంకట నారాయణ కామ్రేడ్‌ను స్మరిస్తూ సంకట ప్రభుత్వాన్ని కూల్చ వెంకటనారాయణ.. అనే పాటను తొలిసారి రాసినట్లుగా అమర్ ఓ సందర్భంగా వెల్లడించారు. అనేక పుస్తకాలు రాశారు. అమరుల కొన్నెత్తుటి దారుల్లో, మానేటి పాటలు, అడవి అంటుకుంది, చితాభస్మం, మిత్ర తెలంగాణ పాటల పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఉద్యమ సిద్ధాంత గ్రంథంగా వేయి విషపు నీడలు అనే పుస్తకాన్ని 1984లో రాశారు. సారాబంద్, సీ్త్ర విముక్తి నృత్యరూపకాలను రాశారు. 2004లో ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లో అమర్ జనశక్తి ప్రతినిధిగా హాజరయ్యారు. ప్రజా ఉద్యమాలపై పాటలను సంధించే అమర్ సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న అలియాస్ రాజేందర్‌కు స్వయాన తమ్ముడు. అభివృద్ధి శాసీ్త్రయంగా ఉండాలని, పీడిత ప్రజలంతా సంఘటితం కావాలని.. ఊపిరి ఉన్నంత కాలం ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగుతానని అమర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
అరుణోదయంకు ముందే పాటల ప్రవాహం
విమలక్క 1972లోనే ‘మారాలి మన సమాజం’ అంటూ పాటలను చిన్నవయసులోనే పాడటం ప్రారంభించారు. ఆలేరులో తన తండ్రి బండ్రు నర్సింహులు రైతుకూలీ సంఘంలో పనిచేస్తుండగా.. అతని స్ఫూర్తితో ఏ పాటనైనా అదే బాణీలో పాడారు. ఎమర్జెన్సీ కాలంలో మరింత ప్రభావితమై గూడ అంజన్న రాసిన పాటను పాడారు. రాంసత్యం మొదటి గురువుగా విమలక్క పాట ప్రస్తానాన్ని సాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె నిర్వహించిన ధూంధాం వేదికలు.. తీరిక లేకుండా పాల్గొన్న సభలు ప్రజాబాహుళ్యంలో ఉద్యమకాంక్షను రగిలించాయి. పాటలు పాడటమే కాదు.. గజ్జె కట్టి, డప్పు వాయిస్తూ.. నృత్యం చేస్తుంటే పల్లెల్లో ఉద్యమస్ఫూర్తి రగులుతోంది.
అరుణోదయ బాటలో...
విమలక్క పాటల ప్రస్థానం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అరుణోదయ బాటలో సాగుతోంది. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాలలో అమరుడైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడుపోసుకుంది. మే 12న 50 ఏళ స్ఫూర్తి సభలు నిర్వహిస్తున్నారు. ‘అరుణోదయం’ అనే సావనీరును ఆవిష్కరించుకోవడం, అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజాసంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించనున్నారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరుణోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పని చేసింది. ఈ సభల్లో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చైన్నె రైటర్ మీనా కందస్వామి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేశ్, చిన్నన్న, గంగ, నూతన్ పాల్గొననున్నారు.
‘ఆడుదాం డప్పుల్లా దరువేయరా.. పల్లె తెలంగాణ పాట పాడరా..’ అంటూ.. విమలక్క గజ్జెగట్టి ఆడితే తెలంగాణ పల్లెలు ఉర్రూతలూగాయి. ‘బిడ్డా నీకు దీవెన.. కన్న బిడ్డా నీకు దీవెన..’ అంటూ అమరుల త్యాగాలను ఆలపిస్తుంటే అవే పల్లెలు కన్నీటి ఊటలయ్యాయి.
‘మా ఊరు ఎములాడ. నా బత్కుదేవులా.. బెస్తోల్ల వాడకెళ్దునా.. కదనరంగమై పోనా..’ అంటూ తన ఊరు, తన ఉనికిని చెప్పారు అమర్ ఉరఫ్ కూర దేవేందర్. ‘మముగన్న మా తల్లి మల్లమ్మా..’ అంటూ అమ్మలోని పోరాట పటిమను అక్షరీకరించారు. సౌమ్యమైన రూపం కలం పడితే పాటల తూటాలు పేల్చుతాడు.

అమర కలం.. విమల గానం