అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి
రాయికల్: రాయికల్ మాజీ ఎంపీటీసీ కై రం పురుషోత్తం (45) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లిన ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. పురుషోత్తంకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన మృతిపట్ల వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘం సభ్యులు సంతాపం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
● మరొకరికి గాయాలు
మంథని: కాటారం – మంథని ప్రధాన రహదారి బట్టుపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై, స్థానికుల కఽథనం ప్రకారం.. మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడకు చెందిన గడి రవి(46), ఎరుకలగూడేనికి చెందిన శేఖర్ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై బట్టుపల్లికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా.. ఎదురుగా మంథని నుంచి కాటారం వైపుగా వెళ్తు కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న రవి కాలు, ఇతర శరీర భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. శేఖర్‌కు సైతం గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంథని సీఐ రాజు.. గాయపడ్డవారిని మంథని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రవికి ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. శేఖర్‌కు ప్రాథమిక చికిత్స అందించి కరీంనగర్ తరలించారు. మృతుడి భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు.
మామిడిపల్లిలో దొంగతనం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లికి చెందిన హుస్సేన్ భీ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. ఈనెల 3న హుస్సేన్ భీ ఇంటికి తాళం వేసి తన కుమారుడు అబ్దుల్ ఇంటికి వెళ్లింది. ఆదివారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది, ఇంట్లోకి వెళ్లి చూడగా 8 తులాల బంగారు ఆభరణాలు, చెవుల కమ్మలు, 20 తులాల వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. అదే గ్రామంలో మరో ఇంటిలో కూడా దొంగలు పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం
కరీంనగర్: పదో తరగతి పరీక్షల మూల్యాంకనం సోమవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో ప్రారంభించనున్నట్లు డీఈవో జనార్దన్‌రావు ప్రకటనలో తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి సీఈ, ఏఈ, స్పెషల్ అసిస్టెంట్, ఓఎస్‌లకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. మూల్యాంకన విధుల ఉత్తర్వులు అందిన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేసి మూల్యాంకన కేంద్రంలో హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. స్పాట్ ఉత్తర్వులు అందిన సిబ్బంది ఉదయం 8.30 గంటలకు క్యాంప్ ఆఫీసర్‌కు రిపోర్టు చేయాలని, సిబ్బంది ఐడీ కార్డు కోసం ఒక ఫొటో తీసుకురావాలని సూచించారు. డైరెక్టర్ ఆదేశాల మేరుకు ఎవరూ కూడా ఫోన్లను మూల్యాంకన కేంద్రంలోనికి తీసుకురావద్దని, గేటు బయటనే భద్రపర్చుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీసీఏ రూల్స్, మూల్యాంకన నియమాలు, యాక్ట్‌ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
అనారోగ్యంతో మాజీ ఎంపీటీసీ మృతి


