● బుగ్గారంలో ఆనవాళ్లు కోల్పోతున్న స్థలాలు
● పట్టించుకోని అధికారులు
బుగ్గారం: బుగ్గారం మండలంలోని పలు ప్రాంతాల్లో గుట్టలు, స్థలాలు మాయం అవుతున్నాయి. కొంతమంది మట్టికోసం.. మరికొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు తవ్వుతున్నారు. అనుమతి లేకుండా.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండడంతో పరిసరాలు గుర్తించలేని విధంగా మారిపోతున్నాయి. ఇదంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణం సమయంలో, ఇతర అవసరాలకు మొరం తవ్వితేనే ఇబ్బందులకు గురిచేసే అధికారులు.. బడాబాబులు, అక్రమార్కులు ఇలా గుట్టలను మాయం చేస్తున్నా పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, చిన్నాపూర్,
గోపులాపూర్ పరిధిలోని గుట్టల స్థలాలను కొంతకాలంగా దర్జాగా తవ్వుతున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రుసుమూ చెల్లించకుండా.. అనుమతి పొందకుండానే అక్రమంగా తవ్వకాలు చేపడుతుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 11 గ్రామాలున్నాయి. అనేక గ్రామాల్లో అటవీశాఖ భూములు ఉన్నాయి. రైతుల పొలాలకు సమీపంలోనే కొన్ని గుట్టలు ఉండడంతో ఆ స్థలాన్ని కలుపుకోవాలనే దురుద్దేశంతో కొంతమంది తవ్వకాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ స్థలంలోని విలువైన వృక్ష సంపద కనుమరుగవుతోంది. మరికొంత మంది మొరం కోసం తవ్వుతున్నారని ప్రజలు చెబుతున్నారు. నాలుగైదేళ్లలో సిరికొండ, మద్దునూర్, యశ్వంతరావుపేట, బుగ్గారం, గంగాపూర్, చిన్నాపూర్‌లోని గుట్టల స్థలాలు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి. అక్రమ తవ్వకాలపై స్థానిక నాయకులు అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల శెకెల్ల శివారులోని గుట్ట స్థలాన్ని జేసీబీలతో రాత్రిపూట మొరం తవ్వకాలు చేపట్టారు. దీనిపై స్థానికులు సంబంధిత అధికారులకు ఫోన్‌లో తెలపగా.. పోలీసులకు ఫోన్ చేయండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. అదేరాత్రి మరో అధికారికి ఫిర్యాదు చేయగా.. ఆయన స్థానిక అధికారులను పంపించారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు తమకు కావాల్సిన మొరాన్ని తవ్వుకున్నారు.