
మానకొండూర్‌రూరల్: మండలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థలోకి చేరాయి. ఏళ్లకొద్ది పాతభవనాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సరైన వసతులు లేకపోవడంతో డాక్టర్లు పశువులకు వైద్యం సరిగా చేయలేకపోతున్నారు. వర్షాకాలంలో వైద్యులు నానా ఇబ్బందులు పడ్తున్నారు. మరోవైపు మందులు నిల్వ చేయడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నారు. మానకొండూర్, పచ్చునూర్‌లో పశువైద్య కేంద్రాలు, చెంజర్ల, అన్నారం, గంగిపల్లి, కొండపల్కల, గట్టుదుద్దెనపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఉపపశువైద్య కేంద్రాలున్నాయి. పచ్చునూర్, గంగిపల్లి పశువైద్య కేంద్రాలు కూలిపోయే దశలో ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి కష్టాలు తీర్చాలని పాడిరైతులు, పశువైద్యాధికారులు, సిబ్బంది కోరుతున్నారు.