
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: గంభీరావుపేటకు చెందిన మహిళకు బ్యాంకు రుణం ఇప్పిస్తామని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను సిరిసిల్ల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు ఆన్‌లైన్ ఆప్ లోన్‌లో ఉన్న ఫోన్ నెంబర్లు సాధించి తద్వారా పలువురికి ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షలు కొట్టేసినట్లు వివరించారు. నల్గొండ జిల్లా దామడిచెర్ల మండలం కూండూరు జానారెడ్డికాలనీకి చెందిన ధనవాత్ రమేశ్, ధనవాత్ రాజు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. డబ్బు సరిపోక హయాత్‌నగర్‌లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రైవర్‌గా పని చేశారు. జస్ట్ డయల్ యాప్‌లో పని కుదుర్చుకున్నారు. పలువురికి లోన్ల పేరిట కాల్ చేసి రుణమిప్పిస్తానని నమ్మబలికారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలానికి చెందిన పద్మావతికి ఏకంగా రూ.26 లక్షలు రుణమిప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు కింద రూ.3,58,795 మిర్యాలగూడలోని ఓ బ్యాంకు యూపీఐతో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అయితే ఆన్‌లైన్ రుణాలిప్పిస్తామన్న కేసుల నమోదున్న రమేశ్, రాజు ఇదే సమయంలో రిమాండ్ వెళ్లారు. తిరిగి జైలు నుంచి రాగానే మళ్లీ పద్మావతికి ఫోన్ చేసి లోన్ రావాలంటే ఇంకో రూ.22వేలు పంపించాలనడంతో అనుమానం వచ్చిన పద్మావతి గంభీరావుపేట పోలీసులకు చెప్పింది. డబ్బులిస్తానని చెప్పడంతో రమేశ్, రాజు గంభీరావుపేట లింగన్నపేట క్రాస్ రోడ్డు వద్దకు రాగానే సీఐ శఽశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్, సైబర్ క్రైం ఆర్‌ఎస్‌ఐ జునైద్ చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి కారు, చెక్ పుస్తకాలు, 3 ఏటీఎం కార్డులు, మూడు మొబైళ్లు, రూ.6.50 లక్షల నగదు పట్టుకున్నారు. ఇప్పటికే వారిపై సైబరాబాద్, అల్వాల్, బేగంపేట, గోపాలపురం, మహంకాళి, రాజేంద్రనగర్, కామారెడ్డి, ఖమ్మం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. బాధితులుగా 19 మంది ఉన్నారు. ఉద్యోగాల పేరిట దాదాపు రూ.20 లక్షలు మోసం చేసినట్లు ఫిర్యాదులున్నాయని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ మహేశ్, సైబర్ క్రైం ఆర్‌ఎస్‌ఐ జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.
● ఉద్యోగాల పేరిట రూ.20 లక్షలు టోకరా

పట్టుబడిన నగదు, సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్
Comments
Please login to add a commentAdd a comment