'కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి..' : ఎంపీ బండి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

'కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి..' : ఎంపీ బండి సంజయ్‌

Oct 30 2023 4:52 AM | Updated on Oct 30 2023 8:17 AM

- - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ బీసీ వర్గాల ప్రజలను దారుణంగా అవమానించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించిన తర్వాతే కేటీఆర్‌కు బీసీ కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా? అంటూ మండిపడ్డారు. గుణమే ముఖ్యమనే కేటీఆర్‌.. బీఆర్‌ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు.

కొడుకు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాత ఆయా వర్గాల ప్రజలను ఓట్లు అడగాలన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు కుమ్కకై ్క బీజేపీ గ్రాఫ్‌ను తగ్గించే కుట్రలు చేస్తున్నాయని, ఎంఐఎం నాయకులకు పెద్ద ఎత్తున డబ్బు సంచులు ముట్టడంతో కరీంనగర్‌లో పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ పూర్తిగా డౌన్‌ ఫాల్‌ అయిందని, ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లే రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదని, అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ఇవన్నీ బయటపడతాయని తెలిసి, బీజేపీ గెలవకూడదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు కాలేదని రైతులతోపాటు నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని తెలి పారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, మాజీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి చదవండి: ఆసిఫాబాద్‌ను ఏలిన ఆ నలుగురు.. వరుసగా 33 సంవత్సరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement