ప్రగతి తప్పిన ప్లానింగ్
నగరంలో అక్రమ నిర్మాణాల జోరు నిర్మాణదారులతో నగరపాలక అధికారుల కుమ్మక్కు? రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న బల్దియా
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక గతి తప్పుతోంది. కొంతమంది అధికా రుల కుమ్మక్కు ఫలితంగా నగరంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. వారి జేబులు నింపుకునేందుకు నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు సైతం దృష్టి పెట్టకపోవడంతో, కిందిస్థాయి అధికారుల అక్రమాల బాగోతానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
వందలాది నిర్మాణాలు
నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రతి డివిజన్‌లో భవన, బహుళ అంతస్తుల, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో అనుమతులకు భిన్నంగా, అసలు అనుమతులే లేకుండా కొనసాగుతున్న భవన నిర్మాణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక అధికారి పాలన సాగిన గతేడాది కాలంలో ఈ అక్రమ నిర్మాణాలు వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ప్రతి డివిజన్‌కు కనీసం ఐదు నుంచి పది నూతన, ఆధునీకరణ, పైఅంతస్తుల నిర్మాణాలు సాగాయి. వీటిలో చాలా వరకు అనుమతులు లేకుండానే నిర్మిస్తుండడంతో, నగరపాలకసంస్థ కనీసం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు అనధికారికంగా అంచనా.
అంతస్తుకో రేటు
భవన నిర్మాణాలకు కొంతమంది పట్టణ ప్రణాళిక అధికారులు రేటు నిర్ణయించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణ గృహాలు, బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్లు.. ఇలా కేటగిరీల వారిగా వసూలు చేస్తుండడం ఇక్కడ బహిరంగ రహస్యమే. సాధారణంగా బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో నగరపాలకసంస్థకు మాటిగేజ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక, అన్ని నిబంధనల ప్రకారం ఉంటే మాటిగేజ్‌ను రిలీజ్ చేస్తారు. కాని మాటిగేజ్ లేకుండా నిర్మాణాలు పూర్తి చేసేందుకు, మాటిగేజ్ రిలీజ్ చేసేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే విమర్శలున్నాయి. అపార్ట్‌మెంట్ల మాటిగేజ్ రిలీజ్ కావాలంటే కనీసం రూ.5 లక్షలు ఇవ్వాలనేది చాలా సాధారణ విషయమని ఓ బిల్డర్ వెల్ల డించారు. నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న ఈ అక్రమ భవన నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి, ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
నగరంలోని 52వ డివిజన్ క్రిస్టియన్‌కాలనీలో నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనంలో నిబంధనలు పాటించడం లేదు. భవనానికి అనుమతి తీసుకున్నా నిబంధనలు మీరి నిర్మాణం కొనసాగుతోంది. అనుమతులు లేకున్నా, సెల్లార్, పెంట్‌హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా నగరపాలకసంస్థ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయింది.
నగరంలోని 44వ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీనగర్‌కాలనీలో నిర్మిస్తున్న ఈ భవనానికి నగరపాలకసంస్థ నుంచి అనుమతులు లేవు. అయినప్పటికి ఈ భవన నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతి లేని భవన నిర్మాణంపై చర్యలు తీసుకుని, ఫీజు వసూలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇ లాంటి అనుమతి లేని భవనాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నాయి.
01కెఎన్‌టీ51:
01కెఎన్‌టీ52:
ప్రగతి తప్పిన ప్లానింగ్
ప్రగతి తప్పిన ప్లానింగ్


