సీఎం పేషీకి ‘ఇల్లీగల్’ వ్యవహారం
కరీంనగర్ అర్బన్: తూనికలు, కొలతలశాఖలో మాజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి రూ. వంద కోట్ల వరకు కూడబెట్టారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అతని అవినీతి వ్యవహారం తాజాగా సీఎం పేషీకి చేరింది. పదోన్నతి వ్యవహారం, ఇల్లీగల్ వసూళ్లు, కోర్టు జడ్జిమెంట్‌ను తిరస్కరించడం, నియామకాల్లో వసూళ్లు, రిపేరర్లను బెదిరించి లక్షల వసూళ్లు, వర్కింగ్ స్టాండర్డ్స్ డిజిట ల్ బ్యాలెన్స్ మిషన్ మాయం, అడ్వాన్ డేట్, ఎక్స్‌టెన్షన్‌కు ఒత్తిడి, వలంటరీ నియామకం కోసం డబ్బు వసూలు, కోర్టు జడ్జిమెంట్‌నే తిరస్కరించడం, శుభకార్యానికి వసూళ్లు, వస్తువుల తరలింపు, ఏసీబీ కేసులున్నా అక్రమ పదోన్నతులు కల్పించడంపై సీఎం పేషీ ఆరా తీస్తోంది.
కుప్పలు తెప్పలుగా అక్రమాలు
విజయసారథి కోర్టు తీర్పును పక్కనబెట్టి ఓ ఉద్యోగిని కొనసాగించడం విడ్డూరం. మహిళా కోటాలో పురుషున్ని నియమించగా కోర్టు టర్నినేట్ చేయాలని ఆదేశించింది. అయినా సదరు వ్యక్తే ఉద్యోగం చేస్తుండడం గమనార్హం. ఇంధన తరలింపులో నిర్ణీత గడువు దాటితే మళ్లీ స్టాంపింగ్ వేయాల్సి ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో ఎక్స్‌టెన్షన్ రాయడం, దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా ఏసీ అక్రమానికే అండగా ఉన్నారని తెలుస్తోంది. అడ్వాన్స్ డేట్ వేసి పెట్రోల్ బంకుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లు చేయగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి 80శాతం వ్యాపార ప్రాంతాలు, రేషన్ దుకాణాలు, మొత్తంగా తూకం వాడే చిన్న మిషన్ నుంచి వేబ్రిడ్జి వరకు స్టాంపింగ్‌లు లేకుండా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇతనింట్లో ఽశుభకార్యానికి ఆహార వస్తువులను హైదరాబాద్‌కు తరలించేలా కిందిస్థాయి సిబ్బందిని తీవ్ర ఒత్తిడి చేయగా, అప్పు చేసి అతని కోరికలు తీర్చారు. ఈ విషయ మై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని తెలుస్తోంది.
ఫిర్యాదులొస్తుంటే..
ఏసీ విజయసారథిపై పదేళ్ల క్రితమే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లగా చర్యలు తీసుకోకపోవడమే ఈ స్థాయి అవినీతికి కారణమని తెలుస్తోంది. 2022లో స్టాండర్డ్స్ మిషన్ లేదని, అడ్వాన్స్ డేట్‌తో పెట్రోల్ బంకుల వద్ద వసూలు చేయాల్సిన డబ్బుకు గండి కొట్టారని ఏసీ వ్యవహారంపై జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ఫిర్యాదు చేసినా చలనం లేకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. 24.01.2022న కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో విజయసారథిపై 420 కేసు నమోదైనా చర్యల్లేవు. టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మి మరో పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా చర్యలు లేకపోవడం అతనిపై శాఖలో ఉన్న పరపతిని చాటుతోంది. ఇంత జరుగుతుండగా మా సార్ మంచోడంటూ అసిస్టెంట్ కంట్రోలర్ పరిధిలోని పలువురు ఉద్యోగులు లేఖలు రాయడం తీవ్ర చర్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీ వసూళ్లలో కీలక పాత్ర పోషించే వాచ్‌మెన్ తను లేఖ రాయడంతో పాటు ఇతర అటెండర్లు, వాచ్‌మెన్లు లెటర్లు రాసేలా ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు లేఖలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో వాచ్‌మెన్ చెప్పడం వల్లే రాశామని, ఇష్టంతో రాసిన లేఖ కాదని చెప్పినట్లు సమాచారం.


