
పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు అందుకుంటున్న నలిమెల భాస్కర్, విమలక్క
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌కు చెందిన పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిలింభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్, అరుణోదయ కళాకారిణి విమలక్కకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ నలిమెల భాస్కర్ నలభై ఏళ్లుగా తెలంగాణ భాష సేద్యం చేస్తున్నారని, ఆయనకు ఈ పురస్కారం రావడం మనందరికి దక్కినట్లేనన్నారు. నల్లరేగడి నేలలో ఎర్రని పాటలు పాడి.. ప్రజల మెదళ్లలో కొత్త ఆలోచనలను మొలకెత్తించే గొప్ప కార్యాన్ని చేపట్టిన విమలక్కకు ఈ అవార్డు దక్కడం గొప్ప విషయమని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ట్రస్ట్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి రవిచంద్ర, ఉపాధ్యక్షుడు అశోక్, కవులు అన్నవరం దేవేందర్, పీఎస్ రవీంద్ర, మాడిశెట్టి గోపాల్, నంది శ్రీనివాస్, పొన్నం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.