
మానీటి గలగల.. ఆయకట్టు కళకళ
● కనుచూపు మేరలో పచ్చని పంటలు
● 14వేల ఎకరాల సాగుకు ప్రాజెక్టు నీరు
● మూడు మండలాల్లోని చెరువులకు నీరు
● సాగు, తాగునీటికి ప్రాజెక్టు
ముస్తాబాద్(సిరిసిల్ల): సిరిసిల్ల మెట్టప్రాంతానికి గుండెకాయ ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. మునుపెన్నడు లేని విధంగా ప్రాజెక్టు అవుట్ ఫ్లో లక్ష క్యూసెక్కుల వరద కింది ప్రాంతానికి వెళ్లింది. దీంతో మానేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలే కాదు రబీ సీజన్‌కు ఢోకా లేదని సంబరపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కాకున్నా ఎగువ ప్రాంతం కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చింది. సిద్దిపేట జిల్లా నుంచి కూడవెళ్లి, కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో భారీగా వరదవచ్చి ఎగువ మానేరు మత్తడి పోసింది.
చెరువుల్లోకి మళ్లింపు
ఎగువమానేరు ప్రాజెక్టులోకి ఆగస్టు 20వ తేదీ వరకే భారీ వరద వచ్చి చేరింది. దాదాపు 25 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వివరాలు తెలుసుకొని కుడి, ఎడమ కాలువలకు నీటిని వదలాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. ఆ సమయంలోనే ఆగస్టు 27వ తేదీ నాటికి ఎగువన అతివృష్టితో ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో మానేరువాగు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కుడి కాలువ ద్వారా పది చెరువుల్లోకి నీరు వచ్చింది. దీంతో చెరువుల కింద ఆయకట్టుకు ఢోకా లేదని రైతులు భరోసాగా ఉంటున్నారు. వానాకాలం పంటలతోపాటు రబీ సీజన్‌కు 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది.
చెరువు గ్రామం ఆయకట్టు
(ఎకరాలు)
కొత్తచెరువు కొండాపూర్ 250
చింతలచెరువు గూడెం 240
మల్లారెడ్డిచెరువు నామాపూర్ 100
దేవరకుంట గూడూరు 50
కొండసముద్రం గూడెం 500
వీరసముద్రం పోతుగల్ 150
లోతుచెరువు మల్లారెడ్డిపేట 450
పెనంమడుగు మల్లారెడ్డిపేట 550
గర్లకుంట, ఊరచెరవు నర్మాల 150
వెంకటాద్రి గంభీరావుపేట 180

మానీటి గలగల.. ఆయకట్టు కళకళ