
గణేశ్ ఉత్సవాల్లో గంజాయి దందా
గోదావరిఖని: గణేశ్ ఉత్సవాల్లో యువతకు మత్తెక్కించేందుకు గంజాయి దందాకు సిద్ధమైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కొత్తగూడెంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన కోడూరి అభినవ్‌వర్ధన్, గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన చెరుకు శ్రీనివాస్ అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్‌హాల్ వెనుకాల చెట్లపొదల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై రమేశ్ తన సిబ్బందితో దాడి చేశారు. 1.220 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే గంజాయి విక్రయిస్తున్నారు. అభినవ్‌వర్ధన్ జల్సాలకు అలవాటు ఈ దందా ఎంచుకున్నాడు. గతంలో ఈ ఇద్దరు రెండు, మూడుసార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయించారు.
కొత్తగూడెం టూ గోదావరిఖని..
గోదావరిఖని చెందిన శ్రీనివాస్ అక్క కొత్తగూడెంలో నివాసం ఉంటోంది. అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది గంజాయి రవాణాకు తెరతీసింది. శ్రీనివాస్ తొలుత 250 గ్రాములు తీసుకొచ్చి ఒకవ్యక్తికి విక్రయించాడు. గోదావరిఖనిలో మంచిడిమాండ్ ఉందని, ఎక్కువ డబ్బులు సంపదించొచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా విక్రయాలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వ్యాపారులతో బేరం కుదుర్చుకున్నాడు. కిలోకు రూ.15 వేలకు ఒప్పందం చేసుకుని రూ.5వేలు అ డ్వాన్స్ ఇచ్చాడు. ఈక్రమంలో పోలీసులకు చిక్కారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు రమేశ్, అనూష, క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుళ్లు రమేశ్, మధూకర్, మధుసూదన్‌ను ఏసీపీ అభినందించారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
గోదావరిఖని ఏసీపీ రమేశ్ వెల్లడి