
పల్లెల్లో బతుకమ్మ సందడి
● సిరిసిల్ల శివారులో షూటింగ్ సందడి
● ఆటపాటలతో తాడూరు, గోపాల్‌రావుపల్లెల్లో సందడి
సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ప్రకృతిని పూజిస్తూ మన ప్రాంత ఆడబిడ్డలు సంతోషంగా కొలిచే పూలపండుగ. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకం. పల్లె, పట్టణం అని తేడా లేకుండా.. గౌరమ్మను పూజించే సంస్కృతి మనది. ఆ పండగకు దాదాపు నెల రోజులు ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ముందే పండుగ కళ వచ్చింది. తంగళ్లపల్లి, గోపాల్‌రావుపల్లి, తాడూరు శివారుల్లో బుధవారం ‘బహుజన బతుకమ్మ’ రంగురంగుల పూలతో ముస్తాబైంది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క బృందం, జానపద కళాకారుడు వంతడ్పుల నాగరాజు పర్యవేక్షణలో ‘బహుజన బతుకమ్మ’ పాట షూటింగ్ జరిగింది. ఒగ్గు కళాకారుడు, డోల్ కళాకారులు, బతుకమ్మలతో మహిళలు.. ఆట పాటలతో సందడి చేశారు. ఉద్యమ గీతాలతో ఉర్రూతలూగించే విమలక్క బతుకమ్మతో చెరువు గట్టుపై తెలంగాణ సాంస్కృతిని ఆవిష్కరించారు.
ప్రకృతి ఆరాధనే బతుకమ్మ పండగ
ప్రకృతి రక్షణే.. ప్రజల రక్షణగా బహుజన బతుకమ్మగా ఈ ఏడాది ప్రజల్లోకి వెళ్తున్నారు. సెప్టెంబరు 20 నుంచి అక్టోబర్ 3 వరకు బహుజన బతుకమ్మను జరుపుకుందామంటూ పాట చిత్రీకరించారు. గత దశాబ్దకాలంగా బహుజన బతుకమ్మను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రకృతి రక్షణను థీమ్‌గా ఎంచుకుని ముందుకురావడం విశేషం. ఈ షూటింగ్‌లో ప్రొఫెసర్ లక్ష్మి, కులనిర్మూలన సంఘం ప్రతినిధులు జ్యోతి, వహీద్, అరుణోదయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనిత, రాష్ట్ర కార్యదర్శి పోతుల రమేశ్, బుల్లెట్ వెంకన్న, రాకేశ్, కళాకారులు పాల్గొన్నారు.

పల్లెల్లో బతుకమ్మ సందడి