సదస్సు ప్రారంభిస్తున్న వ్యవసాయ వర్శిటీ ఉన్నతాధికారి సుధారాణి
హాజరైన శాస్త్రవేత్తలు, రైతులు
జగిత్యాలఅగ్రికల్చర్: అత్యధిక వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చలితీవ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, దీంతో రైతులు సాగు చేసిన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఉత్తర తెలంగాణ జోనల్‌స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు అభిప్రాయపడింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజులపాటు నిర్వహించే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ సుధారాణి అధ్యక్షత వహించారు. వ్యవసాయ వర్శిటీ ఉన్నతాధికారులతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సాగులో సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు..
● ఉత్తర తెలంగాణలోని పది జిల్లాల్లో ఈఏడాది సాధారణంకన్నా 64శాతం అధిక వర్షపాతం నమోదైంది.
● దీంతో వరి, సోయాబిన్, పత్తి, కంది వంటి పంటలకు విఘాతం ఏర్పడింది.
● వరిలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగి, పంటలపై ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు, తాటాకు తెగులు ఆశించాయి.
● మొక్కజొన్న నీట మునిగి ఎదుగల లోపించి దిగుబడి తగ్గింది.
● పత్తి తొలిదశలో మొక్క పెరుగుదల లోపించి, దిగుబడిపై ప్రభావం చూపింది.
● యాసంగి వరిలో పొడి వాతావరణం, రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలతో కాండం తొలిచే పురుగు ఉధృతి పెరిగింది.
● జనవరిలో రాత్రి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై, చలి పెరగడంతో వరి నారుమడులతోపాటు నువ్వులు, వేరుశెనగ, మినుము, నేరుగా విత్తిన వరిపై ప్రభావం చూపింది.
● అయినా విపత్కర పరిస్థితుల్లోనూ వివిధ వరి రకాలు మంచి దిగుబడులు ఇచ్చాయి.
● ఇందులో జేజీఎల్ –28545, జేజీఎల్–27356, జేజీఎల్–33124, జేజీఎల్–33124, జేజీఎల్–28639, జేజీఎల్–35085, కేఎన్‌ఎం–7715, జేజీఎల్–33124, కేఎన్‌ఎం–6965, కేఎన్‌ఎం–7037, కేఎన్‌ఎం–7715, ఆర్‌డీఆర్–1200, ఆర్‌డీఆర్–1162 రకం వరి పంట తెగుళ్లు, పురుగులను తట్టుకుని నిలిచాయయి.
● అలాగే, నువ్వుల్లో జేసీఎస్ –3202, జేసీఎస్–1020, జేసీఎస్–3287 వంటి రకాలు ఆటుపోట్లను తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చాయి.
అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు ఏవీ?
ప్రైవేట్ ధీటుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు రావడం లేదని రైతులు ఆరోపించారు. ఏ పంటలోనైనా కార్పొరేట్ కంపెనీలపైనే ఆధారపడాల్స వస్తోందన్నారు. దీంతో కంపెనీ చెప్పిన ధర చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రసాయన మందులను స్ప్రేయర్‌తో పిచికారీ చేసే పరిస్థితి పోయిందని, సబ్సిడీపై డ్రోన్లను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నాబార్డు రుణాలు నేరుగా రైతులకు ఇవ్వాలని, వినూత్న ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందించాలని కోరారు. భూసార పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యంతో రసాయన ఎరువుల కోసం రూ.వేలు వెచ్చించాల్సి వస్తోందని అన్నారు. శాస్త్రవేత్తలు ఫొటో ప్రజంటేషన్ ద్వారా సమస్యలకు పరిష్కారం చెప్పే బదులు, కరపత్రాలు ఇవ్వాలని రైతులు కోరారు.
వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయాలు
ప్రారంభమైన ఉత్తర తెలంగాణ జోన్ సదస్సు


