కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో భోజనం వడ్డింపు(ఫైల్)
● వ్యవసాయ మార్కెట్లలో అమలుకు సన్నాహాలు ● ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతల్లో హర్షం
కరీంనగర్ అర్బన్: వ్యవసాయ మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో అన్నదాతల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లలో పొద్దస్తమానం పడిగాపులు కాసి ఇబ్బందులు పడే రైతులకు రూ.5కే ఆహారం అందించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో అన్నపూర్ణ పథకం పేరుతో రూ.5కే భోజనం అందిస్తుండగా ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 రాయితీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలోనూ అమలు చేసేందుకు త్వరలో విధి విధానాలు ఖరారు చేయనుంది. అన్నపూర్ణ భోజన పథకాన్ని జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లతో పాటు రైతు బజార్లలోనూ అమలు చేయనున్నారు. సంవత్సరానికి సుమారు 300ల రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతుండగా నిత్యం వందల సంఖ్యలో రైతులు వస్తుంటారు.
వేల మందికి ప్రయోజనం
జిల్లాలో జమ్మికుంట మార్కెట్లో అత్యధికస్థాయిలో క్రయ,విక్రయాలు జరుగుతుండగా తదుపరి కరీంనగర్, గంగాధర, మానకొండూరు మార్కెట్లలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతాయి. చొప్పదండి, గోపాల్‌రావుపేట, హుజూరాబాద్ మార్కెట్లలో ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతుంటాయి. రూ.5 భోజన పథకం ద్వారా వ్యవసాయ మార్కెట్లలో సుమారు లక్ష మంది వరకు భోజనం వడ్డించనున్నారు. 300 పనిదినాలకు గానూ రోజూ అన్ని మార్కెట్లు కలిపి 800 మంది చొప్పున వడ్డించినా ఏడాదికి 24 లక్షల మందికి భోజనం అందనుంది. పంట విక్రయ సమయంలో అన్నదాతలు మార్కెట్లలో రెండు మూడురోజుల వరకు ఉండాల్సి వస్తోంది. ఇంటి నుంచి భోజనం రావాలంటే దూరభారంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. మార్కెట్ల సమీపంలో భోజన సదుపాయం లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఎంతోమంది రైతులు భోజనానికి ఇబ్బందులు పడుతుంటారు. వీట న్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూ.5కే భోజనం అందించేందుకు ప్రణాళికలు చేస్తోంది.
రైతుబజార్లలో కూడా..
జిల్లా కేంద్రంలో రెండు రైతు బజార్లున్నాయి. నగరంలోని శనివారం అంగడి వద్ద, కశ్మీర్‌గడ్డ వద్ద రైతు బజార్లుండగా నిత్యం వందల మంది రైతులు కూరగాయలు తీసుకొస్తారు. వ్యాపారులు బయటకు వెళ్లి భోజనం చేసే తీరిక ఉండదు. ఒకవేళ వెళ్లినా అల్పాహారం తిని సర్దుకుంటున్నారే తప్ప కడుపు నిండా తినడం లేదు. రైతుబజార్లలో కూడా రూ.5కే భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాల వారు ముందుకొస్తే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
కరీంనగర్ మార్కెట్‌లో అమలు
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటికే ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధు ప్రత్యేక చొరవ తీసుకుని భోజనాన్ని అందిస్తున్నారు. ఉచిత భోజనం సౌకర్యం కల్పించడంతో పంట ఉత్పత్తులు అధికంగా వస్తున్నాయి. నాణ్యమైన భోజనంతో పాటు విశ్రాంతి భవనం, శుద్దజలం ఏర్పాటు చేశారు.


