సర్దుబాటు సాధ్యమేనా?
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతుండడంతో సరిచేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా.. తప్పులు సరిచేసేందుకు కుస్తీ పడుతున్నారు. అభ్యంతరాల స్వీకరణకు రెండు రోజులు గడువు విధించినా, ఇప్పటికే పరిస్థితి అర్థం కావడంతో జాబితా సరిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వేల సంఖ్యలో తప్పులు దొర్లడంతో అందులో ఎన్నింటిని సరిచేస్తారు, అసలు సర్దుబాటు చేయడం సాధ్యమేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్లను తొలగించే అధికారం నేరుగా లేకపోవడంతో నగరపాలకసంస్థ అధికారులు కచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారు.
వేలల్లో తప్పులు
నగరపాలకసంస్థ ఎన్నికలకు డివిజన్లవారీగా రూ పొందించిన ఓటర్ల ముసాయిదా గందరగోళంగా మారింది. ఏ ప్రాతిపదికన జాబితా రూపొందించారో అర్థం కాక, ఓటర్లు, ఆశావహులు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. 66 డివిజన్లలో ఇతర డివిజన్, ప్రాంతాల ఓట్లు లేని డివిజన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్‌లో ఇంటినంబర్లు, పోలింగ్ బూత్‌లవారీగా ఉండాల్సినప్పటికీ, ఆ పరిస్థితి ఏ డివిజన్ జాబితా లోనూ కనిపించడం లేదు. ఒక్కో డివిజన్‌లో 30 నుంచి 60 పోలింగ్ బూత్‌ల ఓట్లు రావడం, చాలా ఇంటినంబర్లకు సంబంధించి వరుస క్రమంలో ఓట్లు రాకపోవడం, అసలు ఇంటి నంబర్లే లేని ఓట్లు ఉండడం గందరగోళానికి దారి తీస్తోంది.
తొలగించేది లేదు
ఓటర్ల ముసాయిదాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, సంబంధిత డివిజన్ నాయకులు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లతో సహా ఆధారాలతో అధికారుల ముందుంచుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం ముసాయిదా రూపొందించారు. అందులోని పేర్లన్నింటిని ఇంటినంబర్లు, పోలింగ్‌బూత్‌లవారీగా ఆయా డివిజన్‌లలో సర్దుబాటు చేశారు. దీంతో డివిజన్లవారీగా జాబితా రూపొందించడంతో, డూప్లికేట్ ఓటర్లను గుర్తించడం సులువుగా మారింది. ఆ డూప్లికేట్ ఓట్లను గుర్తించినప్పటికీ, జాబితా నుంచి తొలగించే అధికారం నగరపాలకసంస్థ అధికారులకు లేదు. దీంతో డూప్లికేట్ ఓట్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇంటినంబర్లు లేకుండా ఉన్న ఓట్లను కూడా తొలగించే అధికారం బల్దియాకు లేదు. దీంతో ఇంటినంబర్లు లేనప్పటికి, ఏదో ఒక డివిజన్‌లో ఆ ఓట్లను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అసలు డివిజన్‌కు సంబంధం లేని ఓట్లు కూడా తప్పని పరిస్థితిలో అలానే ఉంచే అవకాశం ఎక్కువగా ఉందంటూ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
64వ డివిజన్‌లో 721 ఓట్లు గుర్తింపు
ప్రతి డివిజన్‌లోనూ సంబంధం లేని ఓట్లు నమోదు కావడం సమస్యకు మరింత కారణమవుతోంది. నగరంలోని 64వ డివిజన్‌లో సంబంధం లేని ఓట్లు 721 ఉన్నట్లు మాజీ కార్పొరేటర్ వాల రమణారావు ఆదివారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి పేర్లతో కూడిన జాబితా అందజేశారు. 2వ డివిజన్‌లో సంబంధం లేని 300 ఓట్లు వచ్చాయని, వీటిని తొలగించాలని మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 7వ డివిజన్‌లో అదనంగా వచ్చిన ఇతర ప్రాంతాల 1275 ఓట్లను తొలగించాలని బీఆర్‌ఎస్ నాయకుడు గూడెల్లి రాజ్‌కుమార్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఓటర్ల ముసాయిదా జాబితాను సవరించి, తుది జాబితా ను రూపొందించడం నగరపాలకసంస్థ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.


