ఒక్క డివిజనూ
సవరించాకే తుది జాబితా
సక్కగ లేకపాయె!
ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ
కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సోమవారమే 111 అభ్యంతరాలు వచ్చాయి. జాబితా అస్తవ్యస్తంగా ఉండడంతో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆయా డివిజన్ లకు చెందిన ఆశావహులు, నాయకులు, ఓటర్లు తమ అభ్యంతరాలను నగరపాలక సంస్థ ప్రజావాణిలో అందజేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలను డివిజన్‌ల వారీగా వేరుచేసి పరిశీలిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్‌లోని 66 డివిజన్‌ల వారీగా ఓటర్ల ముసాయదా జాబితాను ప్రకటించగా, ఒక్క డివిజన్ కూడా సక్రమంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దాదాపు ప్రతి డివిజన్‌లో పక్క డివిజన్, గ్రామీణ, ఇతర ప్రాంత ఓటర్ల వివరాలు వందల కొద్దీ కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు, డివిజన్‌ల డీలిమిటేషన్ జాబితాల ఆధారంగా, ఇంటినంబర్లు, పోలింగ్ బూత్‌ల ప్రకారం జాబితాను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను సవరించడమే సమస్యకు కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఓటర్లు తమ డివిజన్‌లో పేర్లు కనపడక, అసలు తమ ఓట్లు ఉన్నాయా లేదా, ఉంటే ఏ డివిజన్‌లో ఉన్నాయో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఓటు ఉన్నట్లు కనిపిస్తున్నా.. డివిజన్ జాబితాలో మాత్రం కనిపించడం లేదు. కాగా 4వ డివిజన్ దుర్శేడ్‌లో చింతం వంశీ పేరిట మూడు ఓట్లు పక్కపక్కనే వచ్చాయి.
ఒక్క రోజే 111..
జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ సోమవారం ఒక్కరో111 అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటికే 66 రాగా, మొత్తం 187 అభ్యంతరాలు ముసాయిదా జాబితాపై వచ్చాయి. మంగళవారం అభ్యంతరాల స్వీకరణకు చివరిరోజు. కాగా ఓటర్ల జాబితాను సరిచేసి, దొంగఓట్లను తొలగించాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, కమిషనర్ ప్రఫుల్ దేశాయికి వినతిపత్రం అందజేశారు. 18 ఏళ్లు నిండినవారికి కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన వెంట మడుపు మోహన్, వీర దేవేందర్‌పటేల్, మహమ్మద్ అమీర్, శేఖర్, ఇమ్రాన్, ఆసిఫ్ ఉన్నారు. అలాగే 4వ డివిజన్ నుంచి 5వ డివిజన్‌లోకి వెళ్లాయని, వీటిని సరిచేయాలని సుంకిశాల సంపత్‌రావు, మంజుల మల్లారెడ్డి, ఆరె శ్రీకాంత్‌లు కమిషనర్‌కు అభ్యంతరాలు తెలియజేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సవరించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ ఫిర్యాదు చేశారు. ఇంటినంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్‌లో ఓటర్లను పొందుపరచాలని సూచించారు. ఒక ఇంట్లో నలుగురైదుగురు ఉంటే, 20 నుంచి 30 ఓట్లు ఎలా చేర్చారని ప్రశ్నించారు. 7,36,51,64 డివిజన్‌లలో జరిగిన తప్పిదాలను సవరించాలని బీజేపీ నాయకులు తోట సాగర్, అనిల్, కొమ్మెర రవీందర్‌రెడ్డి, బండారి ఆంజనేయిలు, శ్రీనివాస్‌లు కలెక్టర్ పమేలా సత్పతి, నగరపాలక కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 7వ డివిజన్‌కు సంబంధం లేని 1,279 ఓట్లు తొలగించాలన్నారు. 51వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ ఇంటిపై 42 ఓట్లు అక్రమంగా చేర్చారని న్నారు.
ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, పూర్తిస్థాయిలో సవరించి ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని కమిషనర్ ప్రఫుల్ దేశాయి అన్నారు. సోమవారం తన చాంబర్‌లో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఓటరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, డివిజన్‌ల వారీగా ఓటర్ల సవరణ చేసి, తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ బూత్‌లవారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్‌ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం అక్టోబర్ 1న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం మాత్రమే ఈ మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఇతర ప్రాంత్రాల, ఇంటి నంబర్లు లేని ఓట్లను గుర్తించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ముసాయిదాలో చాలా తప్పులుఉన్నాయని, వాటన్నింటిని సరిచేసిన తుది జాబితా ప్రకటించాలని వివిధ రాజకీయపార్టీల నాయకులు డిమాండ్ చేశారు.


